PV Narasimha Rao Computer Learning Behind Story: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు (PV Narasimha Rao) దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' (Bharat Ratna) వరించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం నుంచి దేశం గట్టెక్కించాయి. దేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన నిలిపిన ఘనత ఆయనదే. పీవీ నూతన ఆర్థిక సంస్కరణ పథం.. నేడు వీక్షకులు తమ అభిరుచులకు అనుగుణంగా వందలాది టీవీ ఛానళ్లను చూసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!
ఆ ఒక్క మాటతో
1985వ సంవత్సరం.. రాజీవ్ గాంధీ ప్రధానిగా.. రక్షణ మంత్రిగా పీవీ నరసింహారావు ఉన్నారు. అప్పటికీ కంప్యూటర్ మీద అంత పరిచయం లేనప్పటికీ పీవీకి టెక్నాలజీపై చాలా ఆసక్తి ఉండేది. రాజీవ్ గాంధీకి మాత్రం కంప్యూటర్ పై మంచి అవగాహన ఉండేది. అయితే, ఓ రోజు తన మిత్రుడితో రాజీవ్ గాంధీ మాట్లాడుతూ.. భారత దేశంలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ దిగుమతులను అనుమతించాలని అనుకున్నట్లు చెప్పారు. కానీ, తమ పార్టీలోని పాత వాళ్లు దీన్ని ఎలా తీసుకుంటారో తెలియదని.. ఎందుకంటే వారికి కంప్యూటర్ గురించి అవగాహన తక్కువ కదా అని వ్యాఖ్యానించారు. ఈ మాటలను అక్కడే ఉన్న పీవీ విన్నారు. వెంటనే అదే రోజు సాయంత్రం తన కుమారుడు ప్రభాకరరావుకు ఫోన్ చేసి కంప్యూటర్ శాంపిల్ పంపించాలని సూచించారు. ప్రభాకరరావు హైదరాబాద్ లోనే సొంత కంపెనీ నడిపేవారు. అప్పటికే కొన్ని విడి భాగాలతో 3 ప్రోటో టైప్ డెస్క్ టాప్స్ సైతం ఆయన తయారు చేశారు. తండ్రి కోరిక మేరకు ఓ ప్రోటో టైప్ కంప్యూటర్ ను ఢిల్లీకి పంపారు. అంతే కాకుండా పీవీకి కంప్యూటర్ నేర్పేందుకు ఓ టీచర్ ను కూడా ఏర్పాటు చేశారు.
6 నెలల్లోనే..
అలా, 65 ఏళ్ల వయసులో కంప్యూటర్ పీవీ నరసింహారావు కంప్యూటర్ నేర్చకోవడం ప్రారంభించారు. అయితే, తన కంప్యూటర్ టీచర్ నచ్చకపోవడంతో.. కంప్యూటర్ కు సంబంధించిన మాన్యూవల్స్, బుక్స్ పంపమని కుమారునికి సూచించారు. ఆ పుస్తకాలను ఉదయం, సాయంత్రం చదివి అదే పనిగా 6 నెలలు పాటు పట్టుదలగా కంప్యూటర్ నేర్చుకున్నారు. అయితే, అది సాధారణంగా కంప్యూటర్ వాడకంపైనే కాకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పై కూడా పట్టు సాధించారు. అప్పటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయిన కోబాల్ (COBOL), బేసిక్ (BASIC), యునిక్స్ (UNICS) ఆపరేటింగ్ సిస్టమ్ లో కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నారు. నిజంగా గ్రేట్ కదూ..!
గిన్నిస్ రికార్డు
పీవీ నరసింహారావు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఘనతలు సాధించారు. 1991లో నంద్యాల లోక్ సభ స్థానం నుంచి ఏకంగా 5 లక్షల మెజార్టీతో విజయం సాధించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ప్రధానిగా తన హయాంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన 14 భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. పీవీకి సంగీతం, సినిమా, నాటకాలంటే అమితాసక్తి. భారతీయ ఫిలాసఫీ, సంస్కృతి, రచనా వ్యాసాంగం, రాజకీయ వ్యాఖ్యానం, తెలుగు, హిందీలో కవితలు రాయడం, సాహిత్యాలపై ఎక్కువ శ్రద్ధ చూపేవారు. సుప్రసిద్ధ తెలుగు నవల 'వేయి పడగల'ను పీవీ 'సహస్రఫణ్' పేరుతో హిందీలోకి అనువదించారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
పీవీ ప్రస్థానం..
- పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు.
- 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రికలో 'జయ' అనే మారుపేరుతో 1950 ప్రాంతంలో ఆర్టికల్స్ రాశారు.
- 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1971 నుంచి 1973 వరకూ ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
- 1991లోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్న పీవీ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఆ నిర్ణయం విరమించుకున్నారు.
- దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. నెహ్రూ - గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం.
- పీవీ తీసుకొచ్చిన సంస్కరణల మూలంగా టెక్నాలజీ పరంగా, ఆర్థిక పరంగా దేశం అభివృద్ధి పథంలో నడిచింది. అంతటి మహోన్నత వ్యక్తికి దేశ అత్యున్నత పురస్కారం దక్కడం నిజంగా ఆనందదాయకమని రాజకీయ విశ్లేషకులు, ప్రముఖులు అంటున్నారు.
Also Read: Bharat Ratna 2024: భారత దేశం ఆకలి తీర్చిన MS స్వామినాథన్, ఆహార భద్రత ఆయన చలవే