MS Swaminathan Biography: భారత హరితవిప్లవ పితామహుడు ఎమ్ స్వామినాథన్‌కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. వ్యవసాయ రంగానికి ఆయన అందించిన విశేష సేవలకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించారు స్వామినాథన్. వాళ్ల సమస్యల్ని అర్థం చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే రైతులకు న్యాయం జరుగుతుందో అధ్యయనం చేశారు. ప్రభుత్వాలకు ఎన్నో సలహాలు, సూచనలు చేశారు. ఇప్పటికీ రైతుల సమస్య గురించి ప్రస్తావన వస్తే స్వామినాథన్ కమిటీ ఏం సిఫార్సు చేసిందో పరిశీలిస్తారు. అంతగా వ్యవసాయ రంగంపై చెరగని ముద్ర వేశారాయన. ఆయన ప్రతిభ కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. హరిత విప్లవానికి ఆద్యుడిగా నిలిచారు. ఇప్పుడు దేశంలో వరి, గోధుమ ఈ స్థాయిలో పండుతున్నాయంటే..చిన్న రైతులూ లబ్ధి పొందుతున్నారంటే అందుకు కారణం స్వామినాథన్. ఆ పంటల్ని అంతగా ప్రోత్సహించారు.  


1925లో ఆగస్టు 7వ తేదీన కుంభకోణంలో జన్మించారు. MS స్వామినాథన్ పూర్తి పేరు మంకొంబు సాంబశివన్ స్వామినాథన్. తల్లిదండ్రులు ఎమ్‌కే సాంబశివన్, పార్వతి తంగమ్మల్. తండ్రి ఎమ్‌కే సాంబశివన్ ఓ సర్జన్. కొడుకు కూడా మెడిసిన్ చదివితే బాగుంటుందని తండ్రి కోరుకున్నారు. కానీ...స్వామినాథన్ మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఈ రంగంలోకి వచ్చారు. జెనెటిక్స్‌పై ఆసక్తితో 1952లో University of Cambridgeలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1954లో యూరప్, యూఎస్‌లోని పలు ఇన్‌స్టిట్యూట్‌లలో అధ్యయనం కొనసాగించారు. కటక్‌లోని Central Rice Research Institute లో పని చేయడం ప్రారంభించారు. ఆయన అధ్యయనం చేసే నాటికి భారత్‌లో వ్యవసాయ రంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. సరిపడ వనరులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఫలితంగా...అమెరికా సహా పలు దేశాల నుంచి ఆహారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. భారత్‌ ఇలా వేరే దేశాలపై ఆధారపడకూడదని భావించిన స్వామినాథన్‌ భిన్నమైన వంగడాల తయారీతో పాటు రైతులకు కావాల్సిన ఫర్టిలైజర్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృష్టి చేశారు. రైతుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఆ ప్రభావం పంజాబ్, హరియాణా, యూపీలో స్పష్టంగా కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వ్యవసాయ రంగ నిపుణుల స్ఫూర్తితో రకరకాల పంటలపై అధ్యయనం చేశారు. అలా కొత్త జెనెటిక్ స్ట్రెయిన్‌ని భారత్‌కి పరిచయం చేశారు. హైబ్రిడ్ ప్లాంట్స్‌ తయారీలో కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి వల్లే ఎంత చలినైనా తట్టుకునే హైబ్రిడ్ ఆలుగడ్డల సాగు మొదలైంది. మొక్కల్లో జన్యుమార్పులు చేయడం ద్వారా గోధుమలు, బియ్యం భారీ మొత్తంలో పండేలా మార్పులు తీసుకొచ్చారు. బాస్మతి రైస్‌ స్ట్రెయిన్‌ని పరిచయం చేసిందీ ఆయనే. ఇది ఆహార భద్రతకు మరింత భరోసానిచ్చాయి. 


ఆ తరవాత భారత్‌లోని వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. 1960,70ల్లో ఆయన తీసుకొచ్చిన మార్పులే ఇప్పుడు భారత్‌కి ఆహార భద్రతను కల్పించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సివిల్ సర్వీస్‌ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ అటు వైపు వెళ్లలేదు. వ్యవసాయ రంగానికే మొగ్గు చూపారు. అప్పటి నుంచే రీసెర్చ్ మొదలు పెట్టారు. 1981-85 మధ్య కాలంలో Food and Agricultural Organisation Councilకి ఛైర్మన్‌గా పని చేశారు. ఆ తరవాత కూడా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. 1987లో స్వామినాథన్ International Rice Research Institute (IRR) కి డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. 1989-96 మధ్య కాలంలో Indian Council of Agricultural Research (ICAR) డెైరెక్టర్‌ జనరల్‌గా పని చేశారు. ఆ సమయంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన World Food Prize ఆయనని తొలిసారి వరించింది. నోబెల్ ప్రైజ్ ఎలాగో..వ్యవసాయ రంగంలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అలా. జీవితమంతా వ్యవసాయ రంగానికే అంకితం చేసిన స్వామినాథన్‌ని మొత్తం 40 అవార్డులు వరించాయి. 1943లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్‌లో తీవ్ర కరవు వచ్చింది. ఆ సమయంలో ప్రజలు తిండి లేక అల్లాడిపోయారు. ఈ పరిస్థితులను చాలా దగ్గర నుంచి చూసిన స్వామినాథన్..అప్పుడే తాను వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా అందరికీ సరిపడ ఆహారం అందాలన్నదే లక్ష్యంగా పని చేశారు. ఆయనకు ముగ్గురు కూతుర్లు. సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యారావ్. వీరిలో సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో చీఫ్ సైంటిస్ట్‌గా పని చేశారు. వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆకాంక్షించిన ఆయన చివరి శ్వాస వరకూ అందుకోసమే కృషి చేశారు స్వామినాథన్. 2023లో సెప్టెంబర్ 28న కన్ను మూశారు. 


 Also Read: Bharat Ratna Award: మాజీ ప్రధానులు పీవీ నరసింహా రావు, చరణ్ సింగ్‌కి భారతరత్న - కేంద్రం కీలక ప్రకటన