Bharat Ratna PV Narasimha Rao Profile: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న'ను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఆయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921, జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. ఆ తర్వాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయన్ను దత్తత తీసుకోవడంతో పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. ఉస్మానియా యూనివర్శిటీ, బాంబే, నాగ్ పూర్ విశ్వ విద్యాలయాల్లో చదువుకున్నారు. అనంతరం స్వాతంత్ర్యోద్యమ సమయంలో దేశం కోసం పోరాడిన ఆయన.. రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రికలో 'జయ' అనే మారుపేరుతో 1950 ప్రాంతంలో ఆర్టికల్స్ రాశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1962, 1967, 1972లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన అనంతరం ఆయనకు మంత్రి పదవి దక్కింది. తొమ్మిదేళ్ల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పని చేశారు.
ఉమ్మడి ఏపీ సీఎంగా..
1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఏపీ సీఎంగా నియమించింది. రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన.. రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. 1977లో హనుమకొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
పీఎంగా అప్పుడే
ఎంపీగా ఎన్నికైన అనంతరం పీవీ కేంద్ర కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 1991లో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్న ఆయన.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఆ నిర్ణయం విరమించుకున్నారు. 1991 నుంచి 96 వరకూ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించి సేవలందించారు. దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. నెహ్రూ - గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. దేశం విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో పీవీ.. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ వంటి ఆర్థిక సంస్కరణలతో గాడిన పెట్టారు.
ఈ ఏడాది ఐదుగురికి 'భారతరత్న'
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఐదుగురికి దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్ లకు అవార్డు ప్రకటించింది. ఒక ఏడాది గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ప్రకటించవచ్చు. కానీ 1999లో నలుగురికి ప్రకటించారు. ఆ తర్వాత ఎక్కువ మందికి ఇవ్వడం ఇదే తొలిసారి.
Also Read: Bharat Ratna Award: మాజీ ప్రధానులు పీవీ నరసింహా రావు, చరణ్ సింగ్‌కి భారతరత్న - కేంద్రం కీలక ప్రకటన