Haldwani Violence: ఉత్తరాఖండ్‌లోని హల్‌ద్వానిలో హింస చెలరేగింది. మదర్సాతో పాటు పక్కనే ఉన్న మసీదుని కూల్చి వేయడం స్థానికంగా అలజడి సృష్టించింది. అవి అక్రమ నిర్మాణాలని తేల్చి చెప్పిన అధికారులు కూల్చివేశారు. ఫలితంగా ఒక్కసారిగా అక్కడి వాతావరణం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం హల్‌ద్వానీ నగరం అంతటా కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవల్ని నిలిపిలేసింది. ఆందోళనలకారులు కనిపిస్తే కాల్చేయాలని (Shoot at sight) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి మసీదుని, మదర్సాని కూల్చి వేస్తున్న సమయంలోనే ఈ అల్లర్లు మొదలయ్యాయి. ఈ దాడుల్లో 50 మంది పోలీసులు గాయపడ్డారు. కొంత మంది మున్సిపల్ కార్మికులు, జర్నలిస్ట్‌లకూ గాయాలయ్యాయి. అధికారులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్ బయట వాహనాలకు నిప్పంటించడం మరింత ఆందోళనలకు దారి తీసింది. కోర్టు ఉత్తర్వుల మేరకే తాము ఆ నిర్మాణాలను కూల్చామని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. బుల్‌డోజర్ వచ్చి వాటిని కూల్చి వేసే సమయంలో పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. మహిళలూ ఈ నిరసనల్లో పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్‌లను ధ్వంసం చేశారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. ఆ తరవాత రాళ్లు విసిరారు. దాదాపు 20 బైక్‌లతో పాటు ఓ సెక్యూరిటీ బస్‌నీ తగలబెట్టారు. పోలీస్ స్టేషన్‌నీ ధ్వంసం చేశారు. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
"పోలీసులు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. ఎవరినీ రెచ్చగొట్టలేదు. అయినా వాళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. పోలీస్ స్టేషన్‌ని ధ్వంసం చేశారు. స్టేషన్‌లోని కొంత మంది సిబ్బందికీ నిప్పంటించేందుకు ప్రయత్నించారు"
- అధికారులు
ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాజధాని డెహ్రడూన్‌లో సమావేశం అయ్యారు. అల్లర్లు సృష్టించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.