Puri Rath Yatra Stampede: పూరీ రథయాత్రలో జరిగిన తొక్కిసలాటపై ఒడిశా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సీఎం మోహన్ మాఝీ ప్రభుత్వం పూరీ జిల్లా కలెక్టర్, ఎస్పీలను బదిలీ చేసింది. డీసీపీ విష్ణు పతి, కమాండెంట్ అజయ్ పాధిలను విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని సస్పెండ్ చేసింది.
మృతుల కుటుంబాలకు పరిహారం
ఒడిశా ముఖ్యమంత్రి పూరీ రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.. ముఖ్యమంత్రి అర్బన్ కమిషనర్ పర్యవేక్షణలో తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. చంచల్ రానాను పూరీకి కొత్త జిల్లా కలెక్టర్‌గ3 నియమించారు. పింక్ మిశ్రా కొత్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.
తొక్కిసలాటలో యాత్రికులు మృతి
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదివారం (జూన్ 29, 2025) పూరీలోని ఒక ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి జగన్నాథుడికి భక్తులకు క్షమాపణలు చెప్పారు. రథయాత్రలో నేడు తొక్కిసలాట జరిగిన ఘటనలో కనీసం ముగ్గురు భక్తులు మరణించారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీ గుండిచా ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో మరో 50 మంది గాయపడ్డారు.
సీఎం మోహన్ చరణ్ మాఝీ క్షమాపణలు
ఒడిశా సీఎం మోహన్ మాఝీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ‘నేను, నా ప్రభుత్వం జగన్నాథుడి భక్తులందరికీ క్షమాపణలు చెబుతున్నాం. అనుకోకుండా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. పూరీ జగన్నాథుడి వారికి ఈ కష్టకాలంలో శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. భద్రతా లోపాలను పరిశీలిస్తాం, బాధ్యులు, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని’ ఆయన అన్నారు.
నవీన్ పట్నాయక్ ఘటనపై విచారం
బీజు జనతా దళ్ (బీజేడీ) అధ్యక్షుడు, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు. శ్రీ గుండిచా ఆలయం సమీపంలో యాత్రికులకు ఇబ్బంది లేకుండా రథయాత్రను నిర్వహించడంలో ఒడిశా ప్రభుత్వం విఫలమైందన్నారు. పూరీలోని శారదాబలిలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన ముగ్గురు భక్తుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన యాత్రికులు త్వరగా కోలుకోవాలని పూరీ జగన్నాథుడిని ప్రార్థిస్తున్నానని మాజీ సీఎం నవీన్ పట్నాయక్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. రథయాత్ర సమయంలో జనాల రద్దీని నియంత్రించడంలో ఒడిశా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వేడుకలు మొదలైన రోజు తర్వాత జరిగిన తొక్కిసలాట నిర్ధారించడంలో ప్రభుత్వ అసమర్థతను వెల్లడిస్తుందని ఒడిశా ప్రతిపక్ష నాయకుడు పట్నాయక్ అన్నారు. ప్రభుత్వం ఇకనైనా భక్తుల ప్రాణాలకు ముప్పు కలగకుండా చర్యలు తీసుకుని, పూరీ జగన్నాథుని రథయాత్ర వేడుకలు నిర్వహించాలని సూచించారు.