Agnipath Scheme: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఆమ్‌ఆద్మీ నేతృత్వంలోని పంజాబ్ అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి భాజపాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా పంజాబ్ అసెంబ్లీలోని ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.


యువతకు వ్యతిరేకంగా






దేశ యువతకు అగ్నిపథ్ పథకం వ్యతిరేకమని సీఎం భగవంత్ మాన్ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని, కేంద్ర హోంమంత్రి వరకు తొందరలోనే తీసుకెళ్తామన్నారు. తీర్మానం ప్రవేశ పెట్టిన అనంతరం జరిగిన చర్చలో భగవంత్ మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


విపక్షాల మద్దతు 


ఈ తీర్మానానికి భాజపా మినహా విపక్ష పార్టీలన్నింటి నుంచి మద్దతు లభించింది. విపక్ష నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ బజ్వా ఈ విషయమై మాట్లాడుతూ అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా చేసిన తీర్మానానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు అకాలీదళ్ ప్రకటించింది.


విశేష స్పందన


మరోవైపు అగ్నిపథ్ నియామక పథకానికి విశేష స్పందన లభిస్తోంది. భారత వాయుసేనలో నియామకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 94,281 దరఖాస్తులు వచ్చాయి. రిజిస్ట్రేషన్లు జులై 5 వరకు కొనసాగనున్నాయి. అప్పటిలోగా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.


జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్, బిహార్, తెలంగాణ, బంగాల్, హరియాణా ఇలా చాలా రాష్ట్రాల్లో హింసాత్మకంగా ఆందోళనలు జరిగాయి. అగ్నిపథ్‌ను ఉపసంహరించుకొని పాత నియామక పద్ధతిని పునరుద్ధరించాలని యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు.


Also Read: Maharashtra New CM: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే- భాజపా సంచలన నిర్ణయం



Also Read: Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!