Kisan Mahapanchayat : నెల రోజులుగా నిరాహార దీక్ష చేస్తోన్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్వాల్‌ను ఆస్పత్రికి తరలించకపోవడంపై పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మరోవైపు రైతులు ఓ అడుగు ముందుకేశారు. జనవరి 4న ఖానౌరీ నిరసన ప్రదేశంలో కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు "కిసాన్ మహాపంచాయత్"కు పిలుపునిచ్చారు. అంతకుముందు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా గతంలో డిసెంబర్ 30న పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చాయి.
33వ రోజుకు చేరుకున్న నిరసనలు
జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చేస్తోన్న నిరవధిక నిరాహార దీక్ష శనివారంతో 33వ రోజుకు చేరిందని ఎస్కేఎం (SKM) (నాన్ పొలిటికల్) నాయకుడు కాకా సింగ్ కొట్రా తెలిపారు. "జనవరి 4న ఖానౌరీలో, మేం పెద్ద కిసాన్ మహాపంచాయత్‌ను నిర్వహిస్తాం. ఇందులో వివిధ రాష్ట్రాల రైతులు పాల్గొంటారు" అని ఖానౌరీ నిరసన ప్రదేశంలో కోట్రా విలేకరులతో అన్నారు.
సుప్రీంకోర్టు హెచ్చరిక
పంజాబ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే, ఇతర రైతు నాయకులు దల్లేవాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అనుమతించకపోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తున్నా, ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. నిజంగా ఆయన క్షేమం కోరుకునేవారైతే, అలా వైద్య సాయాన్ని అడ్డుకోరని పేర్కొంది. ఈ విషయాన్ని వారికి తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్ - పంజాబ్ చీఫ్ సెక్రటరీకి సూచించారు.
ఈ విషయంపై స్పందించిన దల్లేవాల్, ఒక వీడియో సందేశంలో, “నేను నిరాహార దీక్షలో కూర్చున్నాను. సుప్రీం కోర్టులో ఈ రిపోర్ట్ ను ఎవరు ఇచ్చారు. నన్ను బందీగా ఉంచారని ఈ అపోహను ఎవరు వ్యాప్తి చేశారు, అసలు ఆ పుకారు ఎక్కడ నుండి వచ్చింది? దేశంలో ఏడు లక్షల మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులను రక్షించడం చాలా అవసరం. అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఎవరి ఒత్తిడికి గురికాను. పంటలపై కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతో సహా రైతుల డిమాండ్లను ఆమోదించేలా కేంద్రాన్ని ఆదేశించాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టుకు లేఖ రాశానని దల్లేవాల్ తన సందేశంలో తెలిపారు. ఇక రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకు నిరాహార దీక్ష విరమించేది లేదని దల్వాల్ గతంలోనే ప్రకటించారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ..
రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వృద్ధ నాయకుడు జగజిత్ సింగ్ దల్లేవాల్ గత నెల 26 నుంచి ఆయన పంజాబ్-హరియాణా సరిహద్దులోని ఖనౌడీ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇటీవల ఆయన క్షీణించడంతో సుప్రీంకోర్టు కలగజేసుకుని.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన వెకేషన్ బెంచ్ ప్రత్యేక విచారణ జరిపింది. ఆస్పత్రిలో చేరేలా దల్లేవాల్‌ను నచ్చజెప్పాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు డిసెంబర్ 31వరకు గడువిచ్చింది. ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు అవసరమైన ప్రయాణ సౌకర్యాల కోసం కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపింది.
Also Read : Bengaluru: మీరెక్కిన క్యాబ్ డ్రైవర్ నిద్రమత్తులో ఉంటే ఏం చేస్తారు? - ఈయన చేసింది మాత్రం వైరల్ అయింది !