Maharashtra Mumbai Rain News: మహారాష్ట్రలో నిన్నటి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్ వణికిపోతున్నాయి. ముందుగానే ప్రభుత్వం అప్రమత్తమైన విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అధికారులందర్నీ సహాయక చర్యలకు పురమాయించింది. ఇప్పటి వరకు కురిసిన వర్షం చూస్తే కొత్త రికార్డులు నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
24 గంటల నుంచి కురుస్తున్న వర్షాలకు ఐదుగురు మృతి
బుధవారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు మహారాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. థానే రూరల్‌లో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. ముర్బాద్ తాలూకాలో కూడా పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అంధేరి ముంబైలో డ్రెయిన్‌లో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రాయ్‌గఢ్‌లో వరదల్లో కొట్టుకుపోయిన మహిళ మరణించారు.
వర్షాలకు ఈ ప్రాంతాలు అతలాకుతలం
బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు 100 మిల్లీమీటర్లకుపైగా వర్షం నమోదైందనట్టు అధికారులు చెబుతున్నారు. వర్షాలకు తూర్పు ముంబై, సెంట్రల్ ముంబై, సౌత్ సెంట్రల్ ముంబై ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ముంబై, థానే, నవీ ముంబై, పాల్ఘర్, పింప్రి చించ్వాడ్, పూణేలోని పాఠశాలలు పూర్తిగా మూసివేశారు.
స్తంభించిన రోడ్డు రవాణా- ఆలస్యంగా నడుస్తున్న లోకల్ ట్రైన్స్
ముంబైలోని చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి కనిపిస్తోంది.ట్రాఫిక్ జామ్ అయింది. వర్షాలు, భారీగా నీరు నిలిచిపోవడంతో లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా రైళ్లను రీషెడ్యూల్ చేశారు. షెడ్యూల్ కంటే 3-4 నిమిషాలు ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి.
ఎగసి పడుతున్న అలలు
ముంబైలో సముద్రంలో 2.29 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటి వరకు తూర్పు ముంబైలో గరిష్టంగా 170 మిల్లీమీటర్లు, సెంట్రల్ ముంబైలో 117 మిమీ, పశ్చిమ ముంబైలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైలో ఇంకా భారీ వానలు పడే అవకాశం ఉంది. 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
పూణె పర్యటన రద్దు చేసుకున్న ప్రధానమంత్రి మోదీ
భారీ వర్షాలు ఉన్నందున ప్రధానమంత్రి తన పూణే పర్యటన వాయిదా వేసుకున్నారు. పూణెలో మెట్రో రైలును మోదీ ప్రారంభించాల్సి ఉంది. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మోదీ పర్యటించాల్సిన ప్రాంతాలు నీట మునిగాయి. బహిరంగ సభ ప్రాంగణం కూడా నీటితో నిండిపోయింది. దీనికి తోడు, వాతావరణం అనుకూలించడం లేదన్న కారణంతో మోదీ తన పర్యటన రద్దు చేసుకున్నారు.
Also Read: మహారాష్ట్రలో కుండపోత వానలు- బయటకు రావద్దని ప్రజలకు అధికారుల హెచ్చరిక