యశ్వంత్‌ సిన్హాను ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తూ ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. ఈమేరకు కొందరు నేతలతో మమత బెనర్జీ మాట్లాడినట్టు తెలుస్తోంది. 


తృణముల్ కాంగ్రెస్‌ సహ అధ్యక్షుడు యశ్వంత్‌ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే ఎలా ఉంటుందనే ఆలోచన మమత బెనర్జీ చేస్తున్నారు. దీనిపై ఆయన నామినేషన్ వేసే ఛాన్స్ ఉందని తృణముల్ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. గతేడాది పశ్చిమబెంగాల్ ఎన్నికల సందర్భంగా యశ్వంత్ సిన్హా టీఎంసీలో చేరారు. ఇప్పుడు ఆయన్ని ప్రతిపక్షాల తరుఫున రాష్ట్ర పతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తోంది టీఎంసీ. దీనికి మూడు నాలుగు పార్టీలు కూడా మద్దతు తెలిపినట్టు సమాచారం. 


యశ్వంత్ సిన్హా  అభ్యర్థిత్వంపై ఇప్పటికే మమత బెనర్జీ కొందరి నేతలతో మాట్లాడినట్టు టీఎంసీ నేతలు చెబుతున్నారు.  ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడేందుకు ఎన్సీపీ చీఫ్‌ శరద్ పవార్, నేషనల్‌ కాన్ఫెరెన్స్ లీడర్ ఫరూఖ్‌ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్ గోపాల్ క్రిష్ణ గాంధీ నిరాకరించిన సంగతి తెలిసిందే. అందుకే యశ్వంత్‌ పేరు తెరపైకి వచ్చింది. 


సిన్హా  ఇప్పుడు TMCలో ఉన్నారు. అందువల్ల ఇది టీఎంసీ ప్రతిపాదనగా ఎవరూ అనుకోవద్దని... వేరే పార్టీల సూచన మేరకే సిన్హా పేరు తెరపైకి వచ్చిందని టీఎంసీ సీనియర్ నాయకుడు అన్నారు.


రేపు దిల్లీలో శరద్‌పవార్‌ ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీలతో సమావేశమై యశ్వంత్ సిన్హా పేరును ప్రతిపాదించనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిబెట్టడంతో ఏకాభిప్రాయం సాధించే దిశగా శరద్‌పవార్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకొని చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశంలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ పాల్గోనున్నారు. తమ పార్టీ అభిప్రాయాన్ని పంచుకోనున్నారు. 


మమతా బెనర్జీ గత వారం దిల్లీలో 22 బీజేపీయేతర పార్టీలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పదిహేడు మంది పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా శరద్‌ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, గోపాల్‌ కృష్ణ గాంధీని మమత బెనర్జీ ఈ సమావేశంలో ప్రతిపాదించారు. ఆరోజే శరద్‌పవార్‌ తన అభిప్రాయాన్ని చెప్పేశారు. తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. అక్కడకు మూడు రోజుల తర్వాత ఫరూఖ్‌ అబ్దుల్లా నిరాకరించారు. తనకు రాష్ట్ర రాజకీయాలే ముఖ్యమని వెల్లడించారు. ప్రసుత్తానికి వేరే ఆలోచనలు లేవన్నారు. ఆఖరుకు గోపాల్‌ కృష్ణ గాంధీ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో యశ్వంత్‌ సిన్హా పేరు తెరపైకి వచ్చింది.


సిన్హా  రెండుసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఒకసారి 1990లో చంద్రశేఖర్ మంత్రివర్గంలో పని చేస్తే. ఆ తర్వాత మరోసారి వాజ్‌పేయి మంత్రివర్గంలో మంత్రిగా సేవలు అందించారు. వాజ్‌పేయి క్యాబినెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖను కూడా ఆయన నిర్వహించారు.


రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ జూలై 18న ప్రారంభం కానుండగా, జూలై 21న ఫలితాలు వెల్లడికానున్నాయి.