Atmakur Bypoll : ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉప ఎన్నికల పోలింగ్ రోజు  సీఆర్పీఎఫ్ బలగాలను వినియోగించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలసి సోమువీర్రాజు ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థితోపాటు, ఎలక్షన్ ఏజెంట్లకు భద్రత కల్పించాలన్నారు. మర్రిపాడు ,ఆత్మకూరు పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ జరిగే అవకాశముందన్నారు. మర్రిపాడులో ప్రస్తుత ఎన్నికల విధులను మరో అధికారికి అప్పచెప్పాలని కోరారు. ఫేక్ ఓటర్ ఐడీలతో ఓట్లు వేయడానికి అధికార పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు సోము వీర్రాజు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు, బీజేపీ సానుభూతి పరులు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఆత్మకూరు, ఏఎస్ పేట, అనంతసాగరంలోని పోలింగ్ బూత్ లలో భద్రత పెంచాలని కోరారు వీర్రాజు. వాలంటీర్లతో ప్రచారం చేయించడాన్ని అడ్డుకోవాలన్నారు. మంత్రులను దించడం, ఓటర్లకు నగదు పంచడం చేసిన రోజే వైసీపీ నైతికంగా ఓడిపోయిందని ఎద్దేవా చేశారు వీర్రాజు. 


వైసీపీ ఓటర్లను ప్రలోభపెడుతోంది


ఆత్మకూరు ఉప ఎన్నికకు టైమ్ దగ్గరపడింది. మరోవైపు ప్రచారానికి బ్రేక్ వేసే సమయం కూడా ముందుకొస్తోంది. కేవలం ఒక్కరోజు మాత్రమే ప్రచారానికి మిగిలుంది. ఈ దశలో ఆత్మకూరులో పట్టు సాధించేందుకు, చివరి నిమిషంలో ఏదో ఒక విధంగా ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇటీవల వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో వాలంటీర్లను ప్రలోభ పెడుతున్నారని, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో జనాలను ప్రలోభ పెట్టి, నయానో భయానో ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనేది బీజేపీ ఆరోపణ. అలా ఓట్లు పడకుండా చేయాలని, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగాలనేది తమ విన్నపం అంటూ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను కలసి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసల్ (ఆర్వో) హరేందిర ప్రసాద్ కి కూడా పలుమార్లు వారు ఫిర్యాదులు చేశారు. 


హోరా హోరీ పోరు సాగేనా.. 


వార్ వన్ సైడ్ అంటున్నాయి వైసీపీ వర్గాలు, లేదు లేదు.. గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. ఆత్మకూరు ఓటర్లు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అధికార పార్టీ ప్రచారాలు మాత్రం భారీ ఎత్తున సాగుతున్నాయి. వారికి ధీటుగా బీజేపీ కూడా గ్రామాల్లో కలియదిరుగుతోంది. నాయకులంతా ఆత్మకూరు ప్రచారానికి బాధ్యులుగా వస్తున్నారు. అయితే బీజేపీకి బలమైన కేడర్ లేకపోవడంతో.. వారంతా నాయకుల ప్రచారంపైనే ఆధారపడ్డారు. అటు టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానుల ఓట్లు కూడా బీజేపీకే పడతాయనే అంచనాలున్నాయి. చివరకు ఏ పార్టీ వారు ఏ పార్టీకి మద్దతిచ్చారనేది రిజల్ట్ రోజు తేలాల్సిందే.