Draupadi Murmu Rejects Mercy Petition: మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ (Mercy Petition) ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) తిరస్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సమాచారం ఇచ్చింది. ఈ విషయం దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం అయింది. మే 3, 2017న వసంత్ సంపత్ దుపారే (అప్పటికి 55 సంవత్సరాలు) అనే వ్యక్తి క్షమాభిక్ష పిటిషన్ (Mercy Petition) ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కింది కోర్టు వేసిన మరణశిక్షను సమర్థించింది. 25 జూలై 2022న దేశ 15వ రాష్ట్రపతి అయిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించిన మొదటి క్షమాభిక్ష పిటిషన్ ఇది. ఈ క్షమాభిక్ష పిటిషన్‌పై ఈ ఏడాది మార్చి 28న రాష్ట్రపతి భవన్ కు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. తాజాగా రాష్ట్రపతి ఆ పిటిషన్‌ను తిరస్కరించారు.
మహారాష్ట్రలో 2008లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి రాళ్లతో కొట్టి చంపిన కేసులో వసంత్ సంపత్ దుపారే (Vasanth Sampath Dupare) అనే వ్యక్తి దోషిగా తేలాడు. 2008లో మహారాష్ట్రలో ఓ నాలుగేళ్ల బాలిక అత్యాచారానికి గురై, హత్యకు గురైంది. వసంత దుపారే (అప్పటికి అతని వయసు 46 ఏళ్లు) అనే వ్యక్తి ఈ దారుణ హత్యాచారం చేశాడని కోర్టు తేల్చింది. చిన్నారి పక్కింట్లోనే ఉండే దుపారే.. తినుబండారాల ఆశ చూపించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బండరాళ్లతో మోది హత్య చేశాడు.
చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుపారేను అరెస్టు చేశారు. అనంతరం విచారణ జరిపిన ట్రయల్ కోర్టు, అతడిని దోషిగా తేల్చి మరణశిక్ష వేస్తూ తీర్పు ఇచ్చింది. దోషి దానిపై అప్పీలుకు వెళ్లగా ఆ శిక్షను బాంబే హైకోర్టు కూడా సమర్థించింది.
ఈ తీర్పుపై 2014లో దుపారే సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించగా అక్కడ కూడా అతనికి చుక్కెదురైంది. అతడి మరణ శిక్షను అత్యున్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. దీంతో ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ 2016లో దుపారే మరో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ రివ్యూ పిటిషన్‌ను 2017లో సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అతడు చేసిన నేరం అత్యంత హేయమైనదని అప్పట్లో కోర్టు అభిప్రాయపడింది. అతడి మరణశిక్షను మళ్లీ సమర్థించింది. దోషికి ఉరిశిక్షను సమర్థిస్తూ, మైనర్ బాలికపై అత్యాచారం చేయడం ఆమె గౌరవాన్ని క్రూరంగా పూడ్చేయడం లాంటిదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో దోషి అయిన దుపారే క్షమాభిక్ష కోరాడు. తాజాగా రాష్ట్రపతి (President Draupadi Murmu) అందుకు నిరాకరించారు.
రాష్ట్రపతి భవన్ జారీ చేసిన సమాచారం
రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) 28 ఏప్రిల్ 2023న క్షమాభిక్ష పిటిషన్ స్థితికి సంబంధించి అప్‌డేట్ చేసిన ప్రకటనలో, "రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను (ఏప్రిల్ 10న) తిరస్కరించారు" అని పేర్కొంది. 2008లో మహారాష్ట్రలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దుపారేకు విధించిన మరణశిక్షను సమర్థించినట్లు పేర్కొన్నారు.