DSP Demoted To Constable In UP: ఆ పోలీస్ అధికారి కానిస్టేబుల్ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి ఎదిగారు. అయితే, ఓ మహిళా కానిస్టేబుల్‌తో అనైతిక సంబంధం అయన్ని మళ్లీ కానిస్టేబుల్ స్థాయికి దించేసింది. ఓ పోలీస్ అధికారి డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌గా డిమోషన్ అయిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. పోలీస్ అధికారి కృపాశంకర్ కన్నౌజియా.. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయికి ఎదిగారు. ఆయన 2021, జులైలో ఉన్నావ్‌లోని బిఘాపూర్‌లో సర్కిల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో కుటుంబ సమస్యలు, వ్యక్తిగత కారణాలు పేర్కొంటూ ఉన్నతాధికారుల అనుమతితో లీవ్ తీసుకున్నారు. ఈ క్రమంలో తన అధికారిక, వ్యక్తిగత ఫోన్లను సైతం స్విచ్చాఫ్ చేశారు. అయితే, ఇదే సమయంలో తన భర్త ఇంటికి రాకపోవడం, ఫోన్లు సైతం కలవకపోవడంతో ఆయన భార్య జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.


మహిళా కానిస్టేబుల్‌తో..


ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఆయన కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వెతుకులాట ప్రారంభించారు. ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. చివరిసారిగా కాన్సూర్‌లోని ఓ హోటల్ వద్ద సిగ్నల్ ఆగిపోయినట్లుగా గమనించారు. దీంతో పోలీసులు ఆ హోటల్‌కు వెళ్లి చూడగా.. కన్నౌజియాను ఓ మహిళా కానిస్టేబుల్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీసీ కెమెరాలు, వారి ఎంట్రీకి సంబంధించిన అన్ని వివరాలను సేకరించి.. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. సదరు అధికారిపై కఠిన చర్యలకు సిఫార్సు చేసింది. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌గా డిమోట్ చేయాలని ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో కన్నౌజియాను గోరఖ్‌పూర్‌లోని 26వ ప్రావిన్షియల్ ఆర్ముడ్ కానిస్టేబుల్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.