Saif Ali Khan : బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగా కీలక విషయాలను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఓ విషయం పోలీసులను షాక్ కు గురి చేస్తోంది. అంత పెద్ద నటుడి స్థాయిలో ఉన్నప్పటికీ వారి ఇంటికి ఎలాంటి భద్రత లేకపోవడంపై పోలీసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, అతని భార్య కరీనా కపూర్ ఖాన్, వారి పిల్లలు బాంద్రాలోని ఓ విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నారు. అయితే భవనం లోపలగానీ, బయటగానీ ఎలాంటి నిఘా కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది.


అంతకుముందు భవనంలోని సీసీటీవీ ఫుటేజీలో ఆగంతకుడు ఫైర్‌ ఎస్కేప్‌ ద్వారా పారిపోతున్నట్లు గుర్తించారు. అయితే, చొరబాటుదారుడు డక్ట్ ద్వారా ఖాన్ నివాసంలోకి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ, భద్రతా కెమెరాలు లేకపోవడంతో చొరబాటుదారుడు వారి ఇంట్లోకి ఎలా రాగలిగాడో గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ఫోరెన్సిక్ నిపుణులు, వేలిముద్ర విశ్లేషకులతో పాటు పోలీసు బృందం ఈ సంఘటనపై మరింత దర్యాప్తు చేయడానికి ఖాన్ నివాసాన్ని సందర్శించింది. ఇంటి ప్రవేశద్వారం వద్ద పర్సనల్ సెక్యూరిటీ గార్డులు లేరని, సందర్శకులను పర్యవేక్షించడానికి లేదా అత్యవసర పరిస్థితుల్లో స్పందించడానికి ఫ్లాట్ లోపల గార్డులు గానీ ఎవరూ లేరని తాజాగా పోలీసులు గుర్తించారు. అంతే కాదు భవనంలోకి ఎవరు వస్తున్నారో, ఎవరు బయటికి వస్తున్నారో తెలుసుకోవడానికి తగిన రిజిస్టర్ లాగ్‌బుక్‌ ను మెయింటైన్ చేయకపోవడం ఈ కేసును ఛేదించేందుకు మరింత కష్టమవుతోంది.


సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్ ఖాన్ వంటి ఉన్నత స్థాయి సెలబ్రెటీలకు సరైన భద్రతా చర్యలు లేకపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన కేవలం ఖాన్‌లకు మాత్రమే కాకుండా, ప్రమాదంలో ఉన్న ఇతర ప్రముఖులకు కూడా హెచ్చరికగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.  



సెలబ్రెటీలకు పొంచి ఉన్న ముప్పు


ఇటీవల జరిగిన రాజకీయ నాయకుడు బాబా సిద్ధిక్ హత్య, నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు లాంటి సంఘటనలను బట్టి చూస్తుంటే సెలబ్రిటీలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. వాస్తవానికి గతేడాది సల్మాన్ ఖాన్ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దుండగులు ఆయన నివాసంపై మోటార్‌సైకిల్‌పై నుంచి కాల్పులు జరిపారు. ఇది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.


మరో పక్క సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన దొంగను పోలీసులు పట్టుకున్నారన్న వార్త వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెగ ప్రచారం జరిగింది. అయితే ఆ వ్యక్తిని విచారించిన పోలీసులు.. దాడి చేసింది అతను కాదని స్పష్టత రావడంతో వదిలి వేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ దాడి ఎవరు చేశారన్న విషయంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.


Also Read : Saif Ali Khan Case: తూచ్ .. సైఫ్ పై దాడి చేసింది ఆ వ్యక్తి కాదు - వదిలేసిన పోలీసులు - మరి ఎవరు ?