Parliament Monsoon Session: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలను విపక్షాలు చక్కగా ఉపయోగించుకోవాలని, దేశానికి మేలు జరిగేలా చర్చలు జరగాలని మోదీ కోరారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లులకు విపక్షాలు సహకరించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
ఈ పార్లమెంటు సెషన్ చాలా ముఖ్యం. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలి. అవసరమున్న ప్రతి అంశంపైనా డిబేట్ నడవాలి. ప్రతి ఒక్క ఎంపీ ఇందులో భాగస్వామి కావాలని కోరుతున్నాను. ఈ సెషన్‌లోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఆలోచనలు దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. ఇది చాలా ముఖ్యమైన సమయం. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు చేసుకుంటోంది. రాబోయే ఆగస్టు 15, రానున్న 25 ఏళ్లు దేశానికి చాలా కీలకం. దేశాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్దాం. - ప్రధాని నరేంద్ర మోదీ