Kallakurichi Violence: ఉత్తర తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ ఆవరణలో ఆదివారం హింసాత్మక ఆందోళనలు జరిగాయి. గత బుధవారం హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ పన్నెండో తరగతి (ఇంటర్ సెకండియర్) అమ్మాయి మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. అప్పటినుంచి ఈ ఘటనపై 4 రోజులపాటు శాంతియుతంగా ఆందోళనలు జరిగాయి. తమకు న్యాయం జరగడం లేదని భావించిన యువతి బంధువులు ఆదివారం నాడు ఆందోళనకు దిగారు. యువతి బంధువులతో పాటు కొందరు ఆందోళనకారులు ఆ విద్యా సంస్థలోకి చొరబడి అన్నింటినీ ధ్వంసం చేశారు. 12 బస్సులు, 3 ట్రాక్టర్లకు మంటపెట్టారు. ఈ కేసులో స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌లను అరెస్ట్ చేసినట్లు డీజీపీ తెలిపారు.


అసలేం జరిగిందంటే..
కళ్లకురిచ్చి జిల్లాలోని కనియమూర్ సమీపంలోని చిన్న సేలంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌, కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదవుతున్న యువతి గత బుధవారం నాడు చనిపోయింది. ఆ విద్యా సంస్థ హాస్టల్ ఆవరణలోనే అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఆ దారుణానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె బంధువులు బుధవారం నుంచి శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరగలేదని భావించిన యువతి బంధువులు, కొందరు ఆందోళనకారులు ఆదివారం స్కూల్ ఆవరణలోకి చొచ్చుకొచ్చారు. స్కూల్ బస్సులు సహా పలు వాహనాలకు నిప్పుపెట్టారు. స్కూళ్లో ఫర్నిచర్ ధ్వసం చేశారు.






పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు 2 సార్లు గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కేసును సీబీ-సీఐడీకి బదిలీ చేస్తున్నట్టు తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు వెల్లడించారు ఈ హింసాత్మక ఆందోళనల్లో ఓ డీఐజీ, ఎస్పీ సహా 54 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 70 మందిని అరెస్ట్ చేశామన్నారు. 






సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి కేసుపై కళ్లకురిచ్చి ఎస్పీ సెల్వకుమార్ స్పందించారు. విద్యార్థిని అనుమానాస్పద మరణానికి సంబంధించి సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నామని, అందరి ముందు తన టీచర్లు అవమానించడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని విద్యార్ధిని సూసైడ్ నోట్ లో రాసిందని ఎస్పీ వెల్లడించారు. కానీ ఎస్పీ చెప్పిన విషయాలను విద్యార్థిని తల్లిదండ్రులు అంగీకరించలేదు. తమ కుమార్తె మరణం వెనుక కుట్ర కోణం ఉందని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 



విద్యార్థిని అనుమానాస్పద మృతి, బంధువుల ఆందోళనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. కళ్లకురిచ్చిలో పరిస్థితి దారుణంగా ఉంది. విద్యార్థిని మృతిపై కొనసాగుతున్న పోలీసుల విచారణ పూర్తిచేసి దోషులను కచ్చితంగా శిక్షిస్తామని స్టాలిన్ ట్వీట్ చేశారు. సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు డీజీపీ, హోంశాఖ కార్యదర్శి స్కూల్‌కు చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. కళ్లకురిచ్చి జిల్లాలో ప్రస్తుతం 144 సెక్షన్ ను విధించారు. శాంతిభద్రతలు మరియు ప్రభుత్వ చర్యలపై విశ్వాసం ఉంచాలని, దోషులను పట్టుకుని కచ్చితంగా శిక్షిస్తామని విద్యార్థిని తల్లిదండ్రులను సీఎం స్టాలిన్ కోరారు.