Wife Killed Husband: కోపంలో ఏం చేస్తామో, ఎందుకు చేస్తామో, దాని పర్యావసానాలు ఏమిటో తెలుసుకునే విజ్ఞత కోల్పోతాం. ఏదైనా మనకు విపరీతమైన కోపం తీసుకువస్తే.. ముందు దానిపై సావధానంగా ఉండాలి. అన్ని దిక్కుల నుండి ఆలోచించాలి. దాని పూర్వాపరాలు అన్నీ బేరీజు వేసుకోవాలి. కానీ ఆవేశం, కోపం అవేవీ ఆలోచించకుండా చేస్తాయి.ఇలా ఆవేశంలో భర్తను చంపేసింది ఓ మహిళ. చిన్న కారణానికే తీవ్రమైన కోపం తెచ్చుకుంది. కత్తితో పొడిచి కట్టుకున్న వాడి ప్రాణాలు తీసింది. ఇప్పుడు కటకటాల పాలయ్యింది.అసలేం జరిగిందంటే..
అసలేం జరిగింది?
అది ఝార్ఖండ్ లోని జామ్తారా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోర్భితా గ్రామం. ఆ ఊర్లో పుష్పా హెంబ్రోమ్ అతని భర్తతో కలిసి ఉంటోంది. శని వారం రాత్రి గోపాల్ పూర్ గ్రామంలో జాతర జరుగుతోంది. ఆ జాతర చూసేందుకు వెళ్లాలనుకుంది పుష్పా హెంబ్రోమ్. జీన్స్ ప్యాంటు ధరించి ఆ జాతరకు వెళ్లింది. జాతర మొత్తం తిరిగింది. చాలా సేపు అక్కడే గడిపింది పుష్పా. జాతర తర్వాత ఇంటికి బయలు దేరింది. జాతరకు వెళ్లినప్పుడు జీన్స్ ధరించి వెళ్లిన పుష్పా.. అదే వస్త్రాధారణతో తిరిగి ఇల్లు చేరింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు, తన భర్తకు మధ్య వాగ్వాదం జరిగింది. జీన్స్ ధరించి జాతరకు ఎందుకు వెళ్లావంటూ భర్త గట్టిగా అడిగాడు. పెళ్లి తర్వాత జీన్స్ ఎందుకు ధరించావని ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర రూపు దాల్చింది. మాటా మాటా పెరిగింది.
ఆవేశంతో ఊగిపోయిన పుష్ప
ఈ క్రమంలోనే పుష్ప సహనం కోల్పోయింది. భర్త తనను ప్రశ్నించడం తట్టుకోలేని పుష్ప హెంబ్రోమ్.. తీవ్ర ఆవేశంతో ఊగి పోయింది. అందుబాటులో ఉన్న కత్తితో భర్తపై విచక్షణా రహితంగా విరుచుకుపడింది. ఏం చేస్తున్నానో అనేది పూర్తిగా మర్చిపోయి కత్తితో భర్తను తీవ్రంగా పొడిచింది.
వైద్యుల శ్రమ వృథా..
భార్య పుష్ప చేసిన ఘాతుకంతో దిగ్భ్రాంతి చెందిన కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ధన్ బాద్ లోని ఆస్పత్రిలో అతడిని చేర్పించారు. తీవ్రంగా గాయపడ్డ అతడికి రక్తస్రావం ఏమాత్రం ఆగలేదు. శరీరం నుండి రక్తం చాలా పోయింది. భార్య చేసిన కత్తి పోట్లు లోపలి వరకు దిగడంతో అంతర్భాగాలు చాలా డ్యామేజ్ అయ్యాయి. వైద్యులు పడిన కష్టం వృథా అయింది. అతడు ప్రాణాలు కోల్పోయాడు. భర్తను కత్తితో పొడిచి చంపిన కోడలిపై మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జీన్స్ ధరించడం గొడవ జరగ్గా... కోడలు కత్తితో విచక్షణారహితంగా పొడిచిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
క్షణికావేశంలో కట్టుకున్న వాడిని హత్య చేసి కటకటాలపాలైంది పుష్ప. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి. అయితే తమ కోపాన్ని, మనసును అదుపులో ఉంచుకోలేని వాళ్లే ఇలాంటి పనులు చేస్తారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా గొడవ జరిగినప్పుడు ప్రశాంతంగా ఆలోచించాలే తప్ప.. ఎలాంటి నిర్ణయాలు తీస్కోవద్దని సూచించారు. కోపంలో తీస్కునే నిర్ణయాలు జీవితాలనే నాశనం చేస్తాయని చెప్పారు. ఇకపై అయినా కోపం ఎక్కువగా వచ్చినప్పుడు కాస్త ప్రశాంతంగా ఉండండి. పూర్తిగా కోపం తగ్గిపోయాకే నిర్ణయాలు తీస్కోండి. మీ జీవితాలను బాగు చేస్కోండి.