Just In





PM Principal Secretary And Security Officer Salary: ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి, భద్రతా అధికారికి ఎంత జీతం వస్తుంది?
పీఎంతోపాటు ఆయన కార్యాలయంలో చాలా మంది పని చేస్తుంటారు. అందులో ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు ప్రధానకార్యదర్శి. మరొకరు ఆయనకు కంటికి రెప్పలా కాపాడే సెక్యూరిటీ సిబ్బంది. మరి వాళ్ల జీతభత్యాల ఎలా ఉంటాయి.?

PM Modi Principal Secretary And Security Officer Salary: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన కార్యదర్శి ఎవరో లేదా వారికి ఎంత జీతం వస్తుందో మీకు తెలుసా? ప్రధానమంత్రి సెక్యూరిటీకి శాలరీ ఎంత వస్తుందో ఏమైనా ఐడియా ఉందా? వాటన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా. ఆయన 1972 బ్యాచ్ గుజరాత్ కాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. డాక్టర్ మిశ్రా 2019 సెప్టెంబర్‌లో ఈ పదవి బాధ్యతలు స్వీకరించారు.
డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డిగ్రీ తీసుకున్నారు. ఆ తరువాత సస్సెక్స్ విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. ఆర్థిక శాస్త్రం/అభివృద్ధి అధ్యయనాల్లో పిహెచ్డీ పొందారు. తన ప్రయాణంలో డాక్టర్ మిశ్రా గుజరాత్ ప్రభుత్వం, భారత ప్రభుత్వంలో అనేక ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు. వాటిలో గుజరాత్ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ కార్యదర్శి వంటి పదవులు ఉన్నాయి.
ప్రధాన కార్యదర్శి పని ఏమిటి?
ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ మిశ్రా పరిపాలనా విధుల నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వారి బాధ్యతల్లో పాలసీ మేకింగ్, కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రభుత్వ కార్యక్రమాల పనితీరును పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఎంత జీతం వస్తుంది?
PM ప్రధాన కార్యదర్శికి పే బ్యాండ్ స్థాయి 18 ప్రకారం జీతం లభిస్తుంది. నివేదికల ప్రకారం, డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రాకి బేసిక్ శాలరీ రూ. 1,37,500. అదనంగా అనేక భత్యాలు, సౌకర్యాలు లభిస్తాయి. ప్రధాన కార్యదర్శికి ప్రభుత్వం నుంచి అనేక రకాల సౌకర్యాలు లభిస్తాయి. వాటిలో ప్రభుత్వ నివాసం, ప్రభుత్వ వాహనం, డ్రైవర్, భద్రత, వైద్య సౌకర్యాలు, ప్రయాణ భత్యం వంటివి ఉన్నాయి.
పీఎం మోడీ భద్రతా అధికారికి ఎంత జీతం వస్తుంది?
భారత ప్రధానమంత్రి భద్రత బాధ్యత స్పెషల్ ప్రొటెక్ష్ గ్రూప్(SPG) చూసుకుంటుంది. SPGలో వివిధ హోదాల్లోని ఉద్యోగులు పని చేస్తుంటారు. వారి జీతం వారి హోదా, అనుభవం, సేవలను ఆధారంగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు SPG భద్రతా అధికారుల వార్షిక జీతం రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉంటుంది. ఇది వారి ర్యాంక్, అనుభవంపై ఆధారపడి ఉంటుంది. SPG ఉన్నత హోదాలైన భద్రతా ఇన్‌చార్జ్ లేదా డైరెక్టర్ వంటి వారి జీతం ప్రజలకు తెలిసే అవకాశం లేదు. దీన్ని గోప్యంగా ఉంచుతారు.
SPG కమాండో అధికారుల జీతం ఎంత?
ప్రధానమంత్రి భద్రతలో పనిచేసే కమాండోల జీతం గురించి మాట్లాడుకుంటే వారి జీతం కూడా అనుభవం ఆధారంగా పెరుగుతూ ఉంటుంది. వివిధ మీడియా నివేదికల ప్రకారం, ఒక SPG కమాండో నెలవారీ జీతం రూ. 84,236 వేల నుంచి రూ. 2,39,457 వరకు ఉంటుంది. ఇది వారి ర్యాంక్, అనుభవంపై ఆధారపడి ఉంటుంది. వారికి ప్రభుత్వం నుంచి అనేక భత్యాలు అందిస్తారు. 11 నుంచి 20 సంవత్సరాల అనుభవం ఉన్న భద్రతా అధికారుల వార్షిక జీతం రూ. 8 లక్షల నుంచి రూ. 18 లక్షల మధ్య ఉంటుంది. SPG ఉద్యోగులకు జీతంతోపాటు ప్రత్యేక భత్యాలు, ప్రమాద భత్యం, ఇతర ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి అందుతాయి. వారికి డ్రెస్ అలవెన్స్ కూడా లభిస్తుంది. ఇది ఆపరేషనల్ డ్యూటీలో ఉన్న కమాండోలకు సంవత్సరానికి రూ. 27,800, నాన్ ఆపరేషనల్ డ్యూటీలో ఉన్న కమాండోలకు సంవత్సరానికి రూ. 21,225 ఉంటుంది.
ప్రస్తుతం అంకెలు ప్రజలకు అందుబాటులో లేవు
భద్రతా ఇన్‌చార్జ్ ప్రత్యేక హోదా, దాని ఆదేశాలను SPG కమాండోలు పాటించాలి. ఈ అధికారుల జీతం ప్రస్తుతం గోప్యంగా ఉంది. కానీ SPG కమాండోల జీతం ద్వారా ఒక భద్రతా అధికారి నెలవారీ జీతం ఎంత ఉంటుందో అంచనా వేయవచ్చు. ఈ హోదాల్లో కూడా అధికారుల జీతం అనుభవం ర్యాంక్ ప్రకారం నిర్ణయిస్తారు. SPG కమాండో అవ్వడానికి ప్రభుత్వం చాలా కఠినమైన నిబంధనలను విధించింది. వాటిని అంగీకరించడం, వాటికి తగినట్లుగా ఉండటం అందరికీ సాధ్యం కాదు.