ఢిల్లీ చేరుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నేరుగా ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు ప్రధాని మోదీ. వీరు ఇరువురూ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇది దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిందని ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రధాని PM మోదీ కలిసిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. భారతదేశం - అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా వీరి మధ్య చర్చలు జరిగినట్లుగా పేర్కొంది.
‘ఎక్స్’లో ప్రధాని మోదీ పోస్ట్
అమెరికా అధ్యక్షుడిని కలిసిన తర్వాత, ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, ‘‘అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. మా సమావేశం చాలా అర్థవంతంగా జరిగింది. మేం భారత్, అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించగలిగాం. మేం ప్రజల మధ్య సంబంధాలను ముందుకు తీసుకువెళ్తాం. మన దేశాల మధ్య స్నేహం ప్రపంచ శ్రేయస్సును అభివృద్ధి చేయడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది’’ అని పోస్ట్ చేశారు.
జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా అధికారిక పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలపై ఇరువురు నేతలు ఈ సమావేశంలో పురోగతిని సమీక్షించవచ్చని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ సమావేశానికి ముందు తెలిపారు. ఇందులో జీఈ జెట్ ఇంజిన్ ఒప్పందం, ప్రిడేటర్ డ్రోన్ కొనుగోలు తదితర అంశాలు ఉన్నాయి.
ప్రధాని మోదీ, జో బిడెన్‌ల ద్వైపాక్షిక సమావేశం
ఈ ద్వైపాక్షిక సమావేశంలో 5జీ, 6జీ స్పెక్ట్రమ్, ఉక్రెయిన్, పౌర అణు రంగంలో పురోగతి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, గల్ఫ్ దేశాలు, ఇతర అరబ్ దేశాలను అనుసంధానించడానికి అమెరికా, భారత్, అరబ్ దేశాలతో ఒక ప్రముఖ ఒప్పందాన్ని ప్రకటించాలని యోచిస్తున్నట్లు వచ్చిన నివేదికలను జేక్ సల్లివన్ ధ్రువీకరించలేదు.
భారత్ నుంచి, మధ్యప్రాచ్య దేశాలు సహా ఐరోపాకు కనెక్టివిటీ చాలా ముఖ్యమైనదని తాము విశ్వసిస్తున్నామని.. ఇది ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనాలతో పాటు అన్ని దేశాలకు వ్యూహాత్మక ప్రయోజనాలను తెస్తుందని ఆయన అన్నారు.
రేపు బిడెన్ రాజ్‌ఘాట్ సందర్శన
జో బిడెన్ వియత్నాంకు బయలుదేరే ముందు ఆదివారం (సెప్టెంబర్ 8) రాజ్‌ఘాట్ మెమోరియల్‌ను కూడా సందర్శిస్తారు. G-20 గ్రూప్‌లో, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ (EU) దేశాలు సభ్య దేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే.