Chandrayaan 3 Landing: చుక్కల్లో చంద్రుడిని ఒడిసిపట్టుకునే అత్యంత అరుదైన ఘటన జరగడానికి మరో కొద్ది గంటల సమయం మిగిలి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి చంద్రయాన్-3 మీదే ఉంది. చంద్రయాన్-3 ప్రయోగం లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడిపై ల్యాండ్ కాబోతోంది. ఇప్పటికే మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువైంది.
ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్‌ను నిరంతరం తనిఖీ చేస్తూ.. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం శాష్త్రవేత్తలు ఎదురు చూస్తున్నారు. బుధవారం సాయంత్రం సుమారు 5.45 గంటల తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఇస్రో శాస్త్రవేత్తల ప్రకారం.. సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 జాబిల్లిపై దిగుతుంది. దీన్ని సురక్షితంగా దించేందుకు భారత శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు చంద్రయాన్-3 ప్రయాణం సాఫీగా సాగుతోందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
వర్చువల్‌గా వీక్షించనున్న ప్రధాని మోడీ
చంద్రుడి దక్షిణ ధ్రువం మీద చంద్రయాన్ దిగే అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిని ఇస్రో సాయంత్రం 5.20 నుంచి లైవ్ టెలికాస్ట్ చేయనుంది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజలు పర్యటన నమిత్తం దక్షిణాఫ్రికా వెళ్లారు. బుధవారం సౌతాఫ్రికాలో రెండో రోజు పర్యటన కొనసాగనుంది. అంతటి బిజీ షెడ్యూల్‌లోనూ ప్రధాని మోడీ చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించనున్నారు. ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలతో వర్చువల్‌గా ఈ మధుర క్షణాలను వీక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
జాబిల్లి చుట్టూ 70కి.మీ ఎత్తులో తిరుగుతోన్న సమయంలో తీసిన తాజా చిత్రాలతోపాటు ఆగస్టు 20న ల్యాండర్ ఇమేజ్ కెమెరా4 తీసిన వీడియోను ఇస్రో షేర్ చేసింది. చంద్రుడిపై దిగే మధుర క్షణాలను యావత్ ప్రపంచం తిలకించేందుకు వీలుగా సాయంత్రం 5.20 నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. చంద్రయాన్ లైవ్ చూసేందుకు దేశంలోని అనేక రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. చంద్రయాన్ దిగే అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
కీలకమైన సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలకు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ కదలికల్ని జాగ్రత్తగా నిర్వహించాలి. అందుకోసం సిగ్నల్స్ ను నిర్వహించేందుకు ఇస్రోకు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సహకరిస్తామని ప్రకటించాయి. ఆస్ట్రేలియాలోని న్యూ నోర్సియా అనే గ్రౌండ్ స్టేషన్ సైతం నేడు చంద్రుడిపై కీలకమైన ల్యాండింగ్ ప్రాసెస్ లో ఇస్రోకు సహకారం అందిస్తామని తెలిపింది.
భారత్ కు చెందిన ఇస్రో శాస్త్రవేత్తలు వినియోగించే సొంత టెక్నాలజీ, యాంటెన్నాతో పాటు కమ్యూనికేషన్ కోసం, సిగ్నల్స్ ను సరైన విధంగా ట్రాక్ చేయడానికి నాసా, యూరప్ స్పేస్ ఏజెన్సీలు తమ యాంటెన్నాతో సహకరించడానికి సిద్ధంగాఉన్నాయి. చంద్రయాన్-3 మిషన్ లో ISROకు చెందిన డీప్ స్పేస్ కమ్యూనికేషన్ యాంటెన్నాతో పాటు, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సమన్వయంతో పనిచేయనున్నాయి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని గ్రౌండ్ స్టేషన్ల నుంచి భారత్ కు కమ్యూనికేషన్, సిగ్నల్స్ ట్రాకింగ్ విషయంలో మద్దతు లభించింది.