Har Ghar Tiranga:
హర్ ఘర్ తిరంగా
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరోసారి హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) ఉద్యమానికి పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. గతేడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశ పౌరులంతా ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని కోరారు. చాలా మంది దీనికి సానుకూలంగా స్పందించారు. ఇంటిపై జెండా ఎగరేశారు. ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సారి కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని అన్నారు ప్రధాని. దేశంతో ప్రతి ఒక్కరూ అనుబంధాన్ని పెంచుకోవాలని సూచించారు. ఆగస్టు 13-15 వరకూ ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పారు. ట్విటర్‌లో వరుస పోస్ట్‌లు చేశారు. సోషల్ మీడియా అకౌంట్‌లకు డీపీగా త్రివర్ణ పతాకాన్నే పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
"హర్‌ఘర్ తిరంగా ఉద్యమ స్ఫూర్తిని అందరూ కొనసాగించాలి. సోషల్ మీడియా అకౌంట్స్‌లో డీపీగా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోండి. దేశం కోసం ప్రాణాలర్పించిన వాళ్లకు గౌరవ సూచకం ఇది. తద్వారా మన మాతృభూమికి మనకు మధ్య బంధాన్ని బలోపేతం చేసుకుందాం"
- ప్రధాని నరేంద్ర మోదీ
అంతకు ముందే ప్రధాని మోదీ ఓ కీలక ట్వీట్ చేశారు. భారతీయులకు త్రివర్ణ పతాకానికి ఉన్న బంధాన్ని గుర్తు చేశారు.
"భారతీయులందరికీ త్రివర్ణ పతాకంతో ఓ ఉద్వేగమైన బంధం ఉంటుంది. దేశ ప్రగతికి మనమంతా కృషి చేయాలన్న స్ఫూర్తిని పంచుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 13-15 వరకూ హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని కొనసాగించాలి. త్రివర్ణపతాకంతో మీ ఫొటోలు షేర్ చేయండి"
- ప్రధాని నరేంద్ర మోదీ