Rishi Sunak: యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak)కు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి కానుక పంపారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ (Jaishankar) అధికారిక పర్యటన నిమిత్తం యూకే(UK) వెళ్లారు. ఈ సందర్భంగా జైశంకర్ బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ ను కలిశారు. తన భార్య క్యోకోతో కలిసి 10 డౌనింగ్‌ స్ట్రీట్‌కు చేరుకున్న ఆయన.. రిషి సునాక్‌, అక్షత మూర్తి దంపతులకు ప్రధాని మోదీ (PM Modi) తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 


పండుగ కానుకగా గణపతి విగ్రహం, భారత్‌స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను రిషి సునాక్‌కు అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను యూకే ప్రధాన మంత్రి కార్యాలయం సోషల్ మీడియ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ చేసింది. ఇద్దరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొంది. అలాగే తనకు ఆతిథ్యం ఇచ్చిన రిషి సునాక్‌ దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ జైశంకర్‌ కూడా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు.






15వరకు జైశంకర్ పర్యటన
విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ నవంబర్ 15వ తేదీ వరకు బ్రిటన్‌లో పర్యటించనున్నారు. భారత్‌ - యూకే ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. బ్రిటన్ విదేశాంగ శాఖ సెక్రటరీ జేమ్స్‌ క్లెవర్లీతోపాటు పలువురు అధికారులతో ఆయన సమావేశం అవనున్నారు.






బైడెన్‌కు కానుకలు
గత జూన్‌లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ గ్రీన్ డైమండ్ పర్యవరణ అనుకూలమైంది. సోలార్, విండ్ పవర్ లాంటి వనరులతో దీనిని రూపొందించారు. ప్రధాని మోదీకి జో - బిల్ బైడెన్ సైతం కానుకలు అందించారు. 20వ శతాబ్దపు ప్రారంభపు కాలానికి చెందిన పురాతన అమెరికన్ బుక్ గ్యాలరీని కానుకగా ఇచ్చారు. బైడన్ పర్సనల్ గా మోదీకి ఓ అమెరికన్ కెమెరాను బహుమతిగా అందించారు.


గ్రీస్ ప్రధాని కుటుంబానికి మేఘాలయ శాలువ 
గ్రీస్ ప్రధాని జీవిత భాగస్వామికి ప్రధాని మోదీ మేఘాలయ శాలువను బహుమతిగా ఇచ్చారు. గత ఆగస్టు నెలలో మోదీ గ్రీస్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా గొప్ప చరిత్ర కలిగిన రాజవంశానికి చెందిన మేఘాలయ శాలువాలను గ్రీస్ ప్రధానికి కుటుంబ సభ్యులకు అందజేశారు. మేఘాలయ శాలువలు ఖాసీ, జైంతియా రాజవంశం కోసం నేస్తారు. వాటిని హోదాకు చిహ్నంగా భావిస్తారు.