Yashobhoomi Inauguration: 


యశోభూమి ప్రారంభం..


బర్త్‌డే రోజు కూడా బిజీబిజీగా గడుపుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ ఎక్స్‌టెన్షన్‌ని ప్రారంభించిన ఆయన...ఆ తరవాత యశోభూమి ఎక్స్‌పో సెంటర్‌నీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎక్స్‌పో సెంటర్‌గా ఇది రికార్డుకెక్కింది. ఈ నిర్మాణం కోసం కేంద్రం దాదాపు రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. ఈ International Convention and Expo Centreకే యశోభూమి (Yashobhoomi) అని నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ల పరిధిలో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించారు. కళ్లు చెదిరిపోయే కన్వెన్షన్ సెంటర్‌తో పాటు ఎగ్జిబిషన్ హాల్స్‌నీ ఇందులో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు, సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ప్రధాని మోదీ ప్రత్యేక చొరవతో ఈ నిర్మాణం చేపట్టారు.  1.8 లక్షల చదరపు మీటర్ల మేర నిర్మాణం జరిగింది. ఇందులో కన్వెన్షన్ సెంటర్‌ని 73 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో మెయిన్ ఆడిటోరియంతో కలిపి 15 కన్వెన్షన్ రూమ్స్ ఉంటాయి. గ్రాండ్ బాల్‌రూమ్‌తో పాటు 13 మీటింగ్ రూమ్స్ నిర్మించారు. 11 వేల మంది ప్రతినిధులు కూర్చున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా విశాలంగా నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముందు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు ప్రధాని. ప్రయాణికులతో కాసేపు మాట్లాడి వాళ్లతో సెల్ఫీలు దిగారు.