Home Minister Amit Shah: 



కేంద్ర హోం మంత్రి తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణకు విముక్తి కలిగించేందుకు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, వాళ్లను స్మరించుకోవాల్సిన సందర్భమిదే అన్నారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సర్దాల్ పటేల్ లేకపోతే...ఈ విమోచన సాధ్యమయ్యేది కాదని తేల్చి చెప్పారు. రజాకార్ల పోరాడి అమరులైన యోధులకు నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవాలను జరపడానికి పలు కారణాలున్నాయని వివరించారు అమిత్ షా. నాటి పోరాట యోధుల్ని ప్రస్తుత తరానికి గుర్తు చేయడం, పోరాట యోధుల్ని సన్మానించడం కోసమే అధికారికంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇవాళ ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవాదివస్‌ జరుపుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా G20 సమ్మిట్‌ గురించీ ప్రస్తావించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ సదస్సు విజయవంతంగా ముగిసిందని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు.






తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ చరిత్రను దాదాపు 75 ఏళ్ల పాటు కొందరు వక్రీకరించారని, మోదీ ప్రధాని అయ్యాక ఆ తప్పుల్ని సరిచేశారని వెల్లడించారు అమిత్ షా. ఈ 9 ఏళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. సర్దార్ పటేల్, కేఎం మున్షీ కారణంగానే తెలంగాణలో నిజాం పాలన అంతమైందని అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థాన్ విమోచన ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి తెలియకుండా గత ప్రభుత్వాలు కుట్ర చేశాయని మండి పడ్డారు. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన ఈ పోరాటం..సమైక్యతా దిన ఎలా అవుతుందని పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ సర్కార్ ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. దీన్ని ఉద్దేశించే అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు.  ఓటు బ్యాంకు కోసమే విమోచన దినోత్సవాన్ని రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. 


"బ్రిటీష్‌ నుంచి భారత్‌కి స్వాతంత్య్రం వచ్చినా నిజాంలు తెలంగాణను 399 రోజుల పాటు పాలించారు. అన్నిరోజులు ఇక్కడి ప్రజలు నరకం చూశారు. సర్దార్ పటేల్‌ రంగంలోకి దిగి 400వ రోజు వాళ్లకు నిజాం కర్కశ పాలన నుంచి విముక్తినిచ్చారు. విమోచన దినోత్సవం జరపాలంటే కొందరు భయపడుతున్నారు"


- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి