Chandrababu News :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో అవినీతి జరిగిందని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ పై అనేక వివాదాలు ఉన్నాయి. అదే సమయంలో కోర్టులో కౌంటర్లు దాఖలు చేయడానికి వారాల తరబడి గడువు అడుగుతున్న లాయర్లు ప్రెస్ మీట్లు పెట్టి గంటల తరబడి వివరాలు చెబుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. లోకేష్ ను కూడా అరెస్ట్ చేయబోతున్నామని బెదిరిస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయం వేడేక్కుతోంది. చంద్రబాబుకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు ఒక్క సారిగా పెరుగుతూండటం అధికార పార్టీని సైతం ఆశ్చర్య పరుస్తోంది. 


చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కుతున్న జనం


తెలుగుదేశం పార్టీ  అధినేతను అరెస్ట్ చేసినప్పుడు పోలీసుల నిర్బంధాల వల్ల కానీ కేసుల భయం వల్ల కానీ ..  ఇతర కారణాల వల్ల కానీ జనం పెద్దగా బయటకు రాలేదని వైఎస్ఆర్‌సీపీ అనుకుంది. కానీ ఒక్క సారిగా వచ్చే ఆవేశంతో బయటకు వచ్చే జనం వెంటనే చల్లబడిపోతారు. కానీ ఇప్పుడు మెల్లగా ఐయామ్ విత్  బాబు అంటూ జనం రోడ్డెక్కుతున్నారు. హైదరాబాద్, బెంగళూరుతో పాటు విదేశాల్లోనూ చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు. తెలంగాణలో ఖమ్మం, మధిర, నిజామాబాద్, కోదాడ వంటి ప్రాంతాల్లోనూ ర్యాలీలు జరగడం ఆశ్చర్యకరంగా మారింది. ఏపీలో నిర్బంధాల వల్ల పెద్దగా బయటకు రాని ప్రజలు శనివారం మాత్రం.. ర్యాలీలతో హోరెత్తించారు. 


మహిళల  ర్యాలీలు


విజయవాడ, గుంటూరుల్లో రెండు రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న నిరసనలు టీడీపీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. మహిళలు ముందు ఉండి మరీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసులు అడ్డుకున్నా ఆగలేదు. గుంటూరులో నిర్వహించిన ప్రదర్శన ముందుగా ప్రీప్లాన్డ్ కాదు. కొంత మంది అలా రోడ్డుపైకి వచ్చారు. తర్వాత విస్తృతంగా ప్రచారం జరగడంతో.. అలా వెంటనే మహిళలంతా రోడ్డుపైకి మద్దతుగా వచ్చారు. ఈ స్పందన అనూహ్యమని.. ఇది రాష్ట్రమంతా పాకితే.. ప్రజాఉద్యమం వస్తుందని ఇది ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమన్న వాదన వినిపిస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేసి వారం రోజులు అవుతోంది. ఓ వైపు స్కిల్ కేసులో ఆధారాలు లేవన్న ప్రచారం బలపడుతూండటం.. మరో వైపు చంద్రబాబు చేసిన పనులను టీడీపీ విస్తృతంగా చేస్తూండటంతో ఆయనపై సానుభూతి పెరిగడానికి కారణం అవుతోంది. ఇవన్నీ వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. 


టీడీపీకి అనవసరంగా చాన్సిచ్చామని వైఎస్ఆర్‌సీపీ నేతల భావన


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం .. అదీ కూడా ఆయనను వేధించినట్లుగా అరెస్ట్ చేయడం వల్ల ఆ పార్టీకి అనసవరంగా చాన్సిచ్చామన్న భావనలో వైసీపీ నేతలు ఉన్నారు. చంద్రబాబుకు విపరీతంగా సానుభూతి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో లోకేష్ ఢిల్లీలో కూడా జాతీయ స్థాయిలో హైలెట్ అయ్యారు. వరుస జాతీయ మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. మరో వైపు రాజమండ్రిలో  నారా బ్రాహ్మణి క్యాండిల్ ర్యాలీ తర్వాత మీడియాతో మాట్లాడిన మాటలు ఆమెలోనూ మంచి లీడర్ ఉన్నారన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నాయి. ఎలా చూసినా టీడీపీకి ఎన్ని బలాలున్నాయో చూపించినట్లయిందన్న వాదన వైసీపీలోనూ వినిపిస్తోంది.