Diamond League Final: ఇండియా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్‌లో తడబడ్డాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన నీరజ్.. తుది పోరులో మాత్రం రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. యూఎస్ఎ (యూగెన్) వేదికగా నిన్న రాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ పోరులో నీరజ్ 83.80 మీటర్లు విసిరి ద్వితీయ స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్ అథ్లెట్ జాకబ్ వాద్లెచ్ 84.24 మీటర్ల త్రో విసిరి అగ్రస్థానంతో డైమండ్ లీగ్ - 2023 విజేతగా నిలిచాడు. ఫిన్‌లాండ్‌కు చెందిన ఓలీవర్ హీలాండర్ 83.74 మీటర్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
కొద్దిరోజుల క్రితమే బుడాపెస్ట్‌లో ముగిసిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం నెగ్గిన నీరజ్.. ఇటీవలే స్విట్జర్లాండ్‌లోని జురిచ్ వేదికగా ముగిసిన డైమండ్ లీగ్‌లో 0.15 సెంటిమీటర్ల తేడాతో అగ్రస్థానం కోల్పోయాడు. తాజాగా యూగెన్‌లో కూడా నీరజ్ అంత యాక్టివ్‌గా కనిపించలేదు. 25 ఏళ్ల ఈ హర్యానా కుర్రాడు.. తొలి త్రో లో 83.80 మీటర్లు విసరగా రెండోసారి 81.37 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. ఆ తర్వాత త్రో ఫౌల్ కాగా మిగిలిన రెండు 80.74 మీటర్లు, 80.90 మీటర్లు మాత్రమే వెళ్లగలిగాయి. దీంతో తొలి త్రోనే నీరజ్‌కు బెస్ట్ త్రో అయింది.
ఈ సీజన్‌లో 85 మీటర్ల కంటే తక్కువ నమోదుచేయడం నీరజ్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. జాకబ్ వాద్లెచ్‌తో పోల్చితే తాజా త్రో లో ఇరువురి మధ్య దూరం 0.44 మీటర్ల దూరమే అయినా అతడు అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా 2022 లో బుడాపెస్ట్ వేదికగా ముగిసిన డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్ చోప్రా అగ్రస్థానం (88.44 మీటర్లు) లో నిలవగా తాజాగా యూగెన్‌లో మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. ఇక 2017, 2018 తర్వత వాద్లెచ్‌కు ఇది తొలి డైమండ్ లీగ్ టైటిల్ కావడం గమనార్హం.
ఈ ఏడాది డైమండ్ లీగ్‌లో నీరజ్ ప్రయాణం..
- మే 5న దోహా (ఖతార్) లో జరిగిన డైమండ్ లీగ్ తొలి అంచె పోటీలలో నీరజ్ 88.67 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు.
- జూన్ 30న లుసాన్నెలో జరిగిన ఈవెంట్‌లో 87.66 మీటర్లు విసిరి ఫస్ట్ ప్లేస్ కాపాడుకున్నాడు.
- స్విట్జర్లాండ్‌లోని జురిచ్ లో గత నెల 31న 85.71 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
డైమండ్ లీగ్ ముగిసిన నేపథ్యంలో ఇక నీరజ్ చోప్రా త్వరలో మొదలుకాబోయే ఆసియా క్రీడలపై దృష్టి సారించనున్నాడు. ఈ ఈవెంట్‌లో స్వర్ణం సాధించే భారత అథ్లెట్లలో ఒక్కడిగా ఉన్న నీరజ్‌కు పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ నుంచి గట్టిపోటీ తప్పకపోవచ్చు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial