The Elephant Whisperers Film: ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్ర బృందం ప్రధాని మోదీని కలిశారు. డాక్యుమెంటరీ దర్శకురాలు, నిర్మాతతో కలిసి దిగిన ఫొటోలను ప్రధానమంత్రి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పంచుకున్నారు. డాక్యుమెంటరీ దర్శకురాలు కార్తికీ గోన్సాల్వేస్ నిర్మాత గునీత్ మోంగా ఆస్కార్ అవార్డులు పట్టుకుని ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ కూడా ఈ ఫొటోలో ఉన్నారు.






"'ది ఎలిఫెంట్ విస్పరర్స్' సినిమా అద్భుతం. ఈ విజయంతో ప్రపంచ దృష్టిని భారత్ వైపు తిప్పారు, అలాగే ప్రశంసలను అందుకున్నారు. ఈ డాక్యుమెంటరీ బృందాన్ని కలిసే అవకాశం నాకు లభించింది. వారు భారతదేశం గర్వపడేలా చేశారు' అని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 


ప్రధానమంత్రి పోస్ట్‌కు నిర్మాత గునీత్ మోంగా స్పందిస్తూ... “మమ్మల్ని మీ ఇంటికి స్వాగతించినందుకు, మా చిత్రాన్ని గౌరవించినందుకు ధన్యవాదాలు. మీ మద్దతు, ప్రోత్సాహం మాకు చాలా ముఖ్యమైనది. మన దేశం వైవిధ్యం, గొప్పతనాన్ని ప్రతిబింబించే ప్రభావవంతమైన కంటెంట్‌ను "మేక్ ఇన్ ఇండియా" కొనసాగించడానికి మేము ఎదురుచూస్తున్నాం” అని ట్వీట్ చేశారు. 






ఏమిటీ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' 


'ది ఎలిఫెంట్ విస్పరర్స్' విషయానికి వస్తే... రెండు పిల్ల ఏనుగుల కథే ఈ డాక్యుమెంటరీ. ఆ ఏనుగు పిల్లలకు తమిళనాడు అటవీ శాఖ తప్పెకాడు ఎలిఫ్యాంట్ క్యాంపులో పునరావాసం కల్పిస్తోంది. గత 140 ఏళ్లుగా అక్కడి అటవీశాఖ ఇటువంటి పని చేస్తోంది. అనాథ ఏనుగులు పరిసర గ్రామల మీద పడి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, అవి బెంగతో చనిపోకుండా కాడు నాయగన్ అనే ఓ గిరిజన తెగకు వాటిని అప్పగిస్తూ ఉంటారు. 


'కాడు నాయగన్' తెగ అడవి జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంది. అటవీ జంతువులు, ఏనుగు పిల్లలను పెంచడంలో ఆ తెగకు తరతరాల వారసత్వం ఉంది. అలా బొమ్మన్, బెల్లీ అనే దంపతులకు రఘు, అమ్ము అనే చిన్న ఏనుగులను పెంచే బాధ్యతను ఫారెస్ట్ ఆఫీసర్స్ అప్పగిస్తారు. వాటిని కుటుంబ సభ్యుల వలే ఎలా పెంచారు? ఆ చిన్న చిన్న ఏనుగు పిల్లలు చేసే చిలిపి పనులు, అల్లరి ఏంటి? బొమ్మన్, బెల్లీతో ఆ ఏనుగులు ఎటువంటి అనుబంధం పెంచుకున్నాయి? అనేది ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కథ. 


'ది ఎలిఫెంట్ విస్పరర్స్'లో అద్భుతమైన విషయం... దీని డైరెక్టర్ లేడీ. కార్తికీ గొన్ సాల్వేస్. ఆమె వయసు 37 సంవత్సరాలు. డాక్యుమెంటరీ కోసం ఆమె ఐదేళ్లు కష్టపడ్డారు. తన బృందంతో కలిసి ఐదేళ్ల పాటు ఏనుగులతో జీవించారు. ఇదంతా కథ కాదు నిజ జీవితంలో బొమ్మన్, బెల్లీలు చేసే పనిని ఐదేళ్ల పాటు అందంగా విజువలైజ్ చేశారు. 40 నిమిషాల డాక్యుమెంటరీలో ఆ కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది.