CM Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిల్లీలో పర్యటించారు. గురువారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం తన దిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడకు బయల్దేరారు.
ఆర్థిక మంత్రితో ముఖ్యమంత్రి చర్చించిన అంశాలు
ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరుచేయాలని సీఎం జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తప్పులేకున్నా... రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని సీఎం వివరించారు. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని, 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లకు కుదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, ఈ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కోరారు.
ప్రత్యేక హోదాపై మరోసారి
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్లు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదల చేసేలా చూడాలని సీఎం జగన్ ఆర్థిక మంత్రిని కోరారు. పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, వెంటనే ఈ నిధులు విడుదల చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చుచేసిన రూ.2600.74 కోట్లను సత్వరమే రీయింబర్స్ చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించిందని, దీనికి వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించి ఇతరత్రా అంశాలను కూడా చర్చించారు సీఎం. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ నిన్న రాత్రి 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని సమస్యలు, రాష్ట్రవిభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ముందస్తుగా పదివేల కోట్లు మంజూరు చేయాలని అమిత్‌షాను రిక్వస్ట్ చేసినట్టు సీఎంవో ప్రకటించింది.
పోలవరంతోపాటు రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి కూడా రిక్వస్ట్ చేసినట్టు తెలుస్తోంది. విభజన జరిగి తొమ్మిదేళ్లు అయినా ప్రధాన సమస్యలు పరిష్కారం కావడం లేదని అమిత్‌షా దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లారని చెబుతున్నారు. దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తెలంగాణ వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. అమిత్‌షాతో సమారు 40 నిమిషాల పాటు సీఎం జగన్ సమావేశమయ్యారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు కాలేదని వాటిని వీలైనంత త్వరగా అమలు చేయాలని రిక్వస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పోలవరం డయా ఫ్రం వాల్ దెబ్బతిందని... దాని మరమ్మతుకు 2020 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందని వాటిని విడుదుల చేయాలని వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 2600.74 కోట్లు ఖర్చు పెట్టిందని వాటిని రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు అంచనాలను 55,548 కోట్లుగా టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ తేల్చిందని వాటిని కూడా జమ చేయాలని కోరారు.