భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణోత్సవం వైభవోపేతంగా సాగుతుంది. వేదమంత్రోచ్ఛారణలతో వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా స్టేడియం వద్దకు తీసుకొచ్చారు. అభిజిత్‌ లగ్నంలో సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ చేయనున్నారు. సీతారాముడి కల్యాణాన్ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.


స్వామివారి కల్యాణ వేడుకకు హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌ రావు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కల్యాణ ఘట్టం జరగనుంది.


ఉదయం 10:30 గంటలకు కల్యాణం ప్రారంభం కాగా.. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రాముడు మాంగళ్యధారణ చేశారు. సీతారాముల కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సాగింది. ప్రతి ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. మిథిలా స్టేడియానికి సువర్ణ ద్వాదశ వాహనాలపై స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా వచ్చారు. కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.


కళ్యాణోత్సవం సందర్భంగా మిథులా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుక కోసం ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలతో కళకళలాడింది.


శ్రీ రామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాములవారి ఆలయాల్లో శ్రీరాముడిని భక్తులు దర్శించుకుంటున్నారు. కొన్నిచోట్ల శోభా యాత్రను నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్టలోని కోదండరామాలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారికి శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.