Hyderabad Crime News: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు ఉండడం సహజం. కానీ ఆ ఇంట్లో వచ్చిన చిన్న గొడవ వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోవాల్సి రాగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. భార్య వల్లే మనశ్శాంతి కోల్పోయానని.. భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా... తన వల్లే భర్తకు ఈ పరిస్థితి వచ్చిందని భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కళ్ల ముందే కూతురు జీవితం నాశనం అవడం, ఆమె చనిపోవడం జీర్ణించుకోలేని తల్లి ఇంటి ముందున్న నీటి సంపులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. 


అసలేం జరిగిందంటే..?


రంగారెడ్డి జిల్లా హైతాబాద్ గ్రామానికి చెందిన మల్లేశ్, యాదమ్మలకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మల్లేశ్ కొన్నేళ్ల క్రితం మృతి చెందగా... కుమార్తె అలియాస్ శిరీషకు రెండున్నర సంవత్సరాల క్రితం రుద్రారం గ్రామానికి చెందిన కమ్మరి శివకుమార్ తో వివాహం జరిపించారు. అయితే వీరికి ఇంకా పిల్లలు పుట్టలేదు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. చిన్న చిన్న మనస్పర్థలతో భర్త శివకుమార్ ఆదివారం రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతడిని వికారాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. 


తనవల్లే భర్త చనిపోవాలనుకున్నాడని...


అయితే తన వల్లే భర్త ఇలా చేసుకున్నాడనే పశ్చాత్తాపంతో... భార్య శిరీశ చనిపోవాలని నిశ్చయించుకుంది. వెంటనే తల్లిగారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే విషయం గుర్తించిన తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కళ్ల ముందే కూతురు జీవితం నాశనం అవడం, ప్రాణాలు కోల్పోవడంతో తల్లి యాదమ్మ తట్టుకోలేకపోయింది. బాధతో తాను కూడా చనిపోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఇంటి ముందు ఉన్న నీటి సంపులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కొన్ని గంటల వ్యవధిలోనే కుటుంబంలో ఇద్దరు చనిపోవడం.. ఒకరు ఆస్పత్రిలో చికిత్త పొందుతుండడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


మొన్నటికి మొన్న ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య


వరంగల్ జిల్లా గున్నెపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకీ రామ్ కూతురు.. 19 ఏళ్ల మద్దుల హేమలతా రెడ్డి హన్మకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే ఇంటి నుంచి వెళ్లి రావడం కష్టంగా ఉందని హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది. ఇటీవలే ఉగాది పండుగ కోసం ఇంటికి వచ్చిన హేమలతా రెడ్డి చేతి ఉంగరం పోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. తల్లిదండ్రులు ఏమంటారోనని భయపడిపోయింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సూసైడ్ లెటర్ రాసింది. అమ్మా, నాన్నా నన్ను క్షమించండి.. ఉంగరం పోగొట్టుకున్నాను.. మీరేమంటారోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. వెంటనే ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.