Todays Weather News: ద్రోణి నేడు ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య భాగాల నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


నేడు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. వచ్చే 5 రోజులు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపారు. నిన్న సిద్దిపేటలో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసింది. వచ్చే నెల 2 వరకూ ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని చెప్పారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 78 శాతం నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు ఎక్కడా వర్షాలు పడే అవకాశం లేదని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.


ఢిల్లీలో వాతావరణం ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా గురువారం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో గురువారం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎండ తీవ్రత నుంచి ప్రజలు ఉపశమనం పొందుతారని భావిస్తున్నారు.


తాజాగా వెస్ట్రర్న్ డిస్ట్రర్బెన్స్ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి వర్షం, మేఘావృతమైన వాతావరణాన్ని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. IMD ప్రకారం, నేటి కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 16.2 డిగ్రీలు, 33.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. IMD ప్రకారం, వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా, ఢిల్లీతో సహా మొత్తం ఉత్తర భారతదేశంలో వాతావరణంలో మార్పులు ఉన్నాయి. రానున్న మూడు రోజుల పాటు ఢిల్లీలో మేఘావృతమై ఉంటుందని అంచనా. మార్చి 30న ఢిల్లీలో మేఘాలు కమ్ముకోవడం వల్ల పగటి ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే రాత్రిపూట చినుకులు పడే అవకాశం ఉంది.