PM Modi Comments In Nalanda University New Campus Inauguration In Bihar: అగ్నిజ్వాలల్లో పుస్తకాలు కాలిపోవచ్చని కానీ జ్ఞానం కాదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.  బిహార్‌లోని రాజ్‌గిర్‌లో బుధవారం నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను (Nalanda University New Campus) ఆయన ప్రారంభించారు. నలంద వర్శిటీ భారతదేశ వారసత్వానికి, సంస్కృతికి చిహ్నమని.. ఈ కొత్త క్యాంపస్ దేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోందని అన్నారు. వర్శిటీ పునఃనిర్మాణంలో మన భాగస్వామ్య దేశాలు సైతం పాలు పంచుకున్నాయని.. ఆయా స్నేహపూర్వక దేశాలను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. 'భారతదేశం బలమైన మానవ విలువలపై నిలబడుతుంది. చరిత్రను పునరుద్ధరించడం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయడం ఎలాగో మనకు తెలుసు. నలంద అంటే ఓ గుర్తింపు, గౌరవం, విలువ, ఓ అమోఘ కథ.. ఈ వర్శిటీ అనంత సత్యానికి నిదర్శనం' అని మోదీ పేర్కొన్నారు.






నూతన క్యాంపస్ ప్రారంభం








బుధవారం ఉదయం నలంద వర్శిటీకి చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా పాత వారసత్వాన్ని పరిశీలించారు. అనంతరం కొత్త క్యాంపస్‌కు చేరుకుని అక్కడ బోధి వృక్షాన్ని నాటిన అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎన్.జైశంకర్, బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాత్ అర్లేకర్, సీఎం నితీష్ కుమార్, నలంద వర్శిటీ వీసీ అరవింద్ పనగారియా హాజరయ్యారు. అలాగే, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, బ్రూనై, భూటాన్, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, సింగపూర్, న్యూజిలాండ్, పోర్చుగల్, శ్రీలంక, వియత్నాం ఇలా మొత్తం 17 దేశాల నుంచి విదేశీ రాయబారులు సైతం పాల్గొన్నారు.


ఇదీ చరిత్ర


పురాతన నలంద విశ్వ విద్యాలయాన్ని ఐదో శతాబ్దంలో స్థాపించారు. అప్పట్లో ఈ వర్శిటీలో ప్రపంచ దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. ఈ వర్శిటీ 800 ఏళ్ల పాటు సేవలందించినట్లు నిపుణులు తెలిపారు. అయితే, 12వ శతాబ్దంలో దేశంలోకి వచ్చిన ఆఫ్ఘన్లు ఈ వర్శిటీని కూల్చేశారు. పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్‌లను కాల్చేశారు. 2016లో ఈ ప్రాంతాన్ని వారసత్వ సంపదగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ తర్వాత 2017లో వర్శిటీ నిర్మాణ పనులు ప్రారంభించారు.  కొత్త క్యాంపస్‌ను నలంద విశ్వవిద్యాలయ చట్టం, 2010 ద్వారా స్థాపించారు. 


ఇవీ ప్రత్యేకతలు


నలంద వర్శిటీలో 40 తరగతి గదులతో పాటు 2 అకడమిక్ బ్లాకులు ఉన్నాయి. మొత్తం 1900 మంది విద్యార్థులకు సీటింగ్ ఏర్పాటు చేయగా.. 300 సీట్లున్న రెండు ఆడిటోరియంలు ఉన్నాయి. అలాగే, అంతర్జాతీయ కేంద్రం, యాంపీ థియేటర్ కూడా నిర్మించారు. ఇందులో 2 వేల మంది సీటింగ్ సామర్థ్యం ఉంది. వాటితో పాటు విద్యార్థులకు ఫ్యాకల్టీ క్లబ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో పాటు ఇతర సౌకర్యాలు సైతం ఉన్నాయి. ఈ వర్శిటీని 'NET Zero' క్యాంపస్ అంటారు. పర్యావరణ అనుకూల కార్యకలాపాలు, విద్య ఇక్కడ ఉంటుంది. క్యాంపస్‌లో నీటిని రీసైకిల్ చేయడానికి ఓ ప్లాంట్, 100 ఎకరాల నీటి వనరులతో పాటు పర్యావరణ అనుకూలమైన సకల సౌకర్యాలు ఉన్నాయి. అందుకే ఈ వర్శిటీ అంత ప్రసిద్ధి చెందింది.