PM Modi Announced Surya Ghar Scheme to Provide Free Current: సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తరించి సామాన్యులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా సామాన్య పౌరులపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించేలా.. ఉచిత విద్యుత్ పథకం అమలు దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు వీలుగా 'పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన' (PM Surya Ghar: Muft Bijili Yojana) పథకానికి మంగళవారం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రధాని మోదీ (PM Modi) స్వయంగా ట్విట్టర్ ద్వారా కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే సంబంధిత వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 'మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం 'పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన' పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ పథకంతో.. ప్రతి నెలా 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం. రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు. ప్రజలపై ఎలాంటి వ్యయ భారం ఉండదని హామీ ఇస్తున్నాం.' అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.






ఉపాధి కల్పన






ఈ పథకంతో విద్యుత్ బిల్లులు తక్కువ రావడం సహా ఉపాధి కల్పన జరుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు. క్షేత్రస్థాయిలో 'సూర్య ఘర్' పథకానికి ప్రచారం తీసుకొచ్చేందుకు.. పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు చెప్పారు. వారు తమ పరిధిలో ఈ రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ప్రోత్సహించాలని సూచించారు. 'సౌరశక్తి, స్థిరమైన అభివృద్ధి మరింత విస్తృతం చేద్దాం. గృహ వినియోగదారులు, ముఖ్యంగా యువత 'సూర్య ఘర్' పథకాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నా.' అని ట్వీట్ లో పేర్కొన్నారు.


అర్హులు వీరే..!


'సూర్య ఘర్' పథకం దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్ భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రెసిడెన్షియల్ వినియోగదారులు, గ్రూప్ హౌసింగ్ సొసైటీ సభ్యులు దరఖాస్తుకు అర్హులు.


దరఖాస్తు ఇలా..


ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు https://pmsuryaghar.gov.in వెబ్ సైట్ కు వెళ్లాలి. అందులో 'Apply For Rooftop Solar' అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.


* ఆ తర్వాత మీ వివరాలతో రిజిస్టర్ కావాలి. అనంతరం మీ మొబైల్ నెంబరుతో లాగిన్ అయ్యి రూఫ్ టాప్ సోలార్ సంబంధిత ఫామ్ నింపాలి.


* అనంతరం మీకు డిస్కంల నుంచి 'ఫీజిబిలిటీ అప్రూవల్' వస్తుంది. ఆ తర్వాత డిస్కంల్లో రిజిస్టరైన సరఫరాదారుల ద్వారా మీరు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చు.


* పూర్తిగా ఇన్ స్టాలేషన్ అయిన తర్వాత ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్ మీటర్ వచ్చిన తర్వాత మీ రూఫ్ టాప్ ను డిస్కం అధికారులు తనిఖీ చేసి 'కమిషనింగ్ సర్టిఫికెట్' ఇస్తారు.


* అనంతరం ఈ సర్టిఫికెట్ తో పాటు క్యాన్సిల్ చేసిన బ్యాంక్ చెక్ బుక్ ను 'పీఎం సూర్యఘర్' పోర్టల్ లో అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత 30 రోజుల్లో మీ ఖాతాల్లోకి సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి.


'సూర్య ఘర్' ప్రయోజనాలివే


* 'సూర్య ఘర్' పథకం కింద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకున్న వారికి ఏటా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకూ ఆదా అవుతాయి.


* అంతే కాకుండా సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ లో ఇంటి అవసరాలకు పోనూ మిగతా కరెంట్ ను డిస్కంలకు అమ్ముకోవచ్చు.


* ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ పథకం ద్వారా సోలార్ పరికరాల తయారీ, నిర్వహణ, సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసే సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.


Also Read: Delhi Chalo: 'ఢిల్లీ ఛలో'తో సరిహద్దు వద్ద ఉద్రిక్తత - భారీగా ట్రాఫిక్ జామ్, రైతులపై భాష్పవాయువు ప్రయోగం