Parliament Special Session Day-1:
అమృత్‌కాల్ సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అంటూ కేంద్రం ప్రకటించినప్పటి నుంచి... ఆ సమావేశాలపై చర్చ జరుగుతూ ఉంది. ఐదు రోజులపాటు జరగనున్న ఈ ప్రత్యేక సెషన్స్‌లో మొదటి రోజు సమావేశాలు పాత పార్లమెంట్ భవన్‌లోనే జరిగాయి. 75ఏళ్ల పార్లమెంటు ప్రయాణం- విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభ్యాసాలపై చర్చ జరిగింది. ఆ తర్వాత పాత భవనానికి వీడ్కోలు పలికారు. రేపటి నుంచి పార్లమెంట్ కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి.
మొదటి రోజు సమావేశాల్లో... ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు మిగిలిన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ఒక ప్యానెల్ ఏర్పాటు కోసం బిల్లు ప్రవేశపెట్టారు. కానీ.. ప్రతిపక్షాలు ఆ బిల్లును ప్రతిఘటించాయి. దీంతో బిల్లును శాసన వ్యవహారాల జాబితా నుంచి తొలగించారు. ఇక... లోక్‌సభ, రాజ్యసభలో సెషన్ యొక్క లెజిస్లేటివ్ బిజినెస్ కింద జాబితా చేయబడిన ఇతర బిల్లుల్లో ది అడ్వకేట్స్ సవరణ బిల్లు-2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023, పోస్ట్ ఆఫీస్ బిల్లు-2023 ఉన్నాయి.
ప్రత్యేక సమావేశాల తొలిరోజు... పార్లమెంట్ భవనంలో చివరి ప్రసంగం చేశారు ప్రధాని మోడీ. పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఈ భవనం గొప్ప చరిత్రను ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, ఈ భవనం ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. స్వాతంత్ర్యం తర్వాత ఇది సంసద్ భవన్, భారత పార్లమెంటుగా మారింది. ఈ భవనాన్ని నిర్మించాలని బ్రిటీష్ పాలకులు నిర్ణయం తీసుకున్నది వాస్తవమే అయినా... దీన్ని కట్టడానికి పడిన శ్రమ, డబ్బు భారతదేశ వాసులదేనని మనం ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. ఆ నిజాన్ని గర్వంగా చెప్పుకోవాలన్నారు ప్రధాని.
రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరగనున్న తరుణంలో పాత పార్లమెంట్ భవనాన్ని ఏం చేస్తారనే చర్చ మొదలైంది. ఆ భవనాన్ని కూల్చేస్తారా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కొంత మంది పాత పార్లమెంట్ భవనం విశిష్టత గురించి చర్చించుకుంటున్నారు. 1927లో పూర్తయిన పార్లమెంట్ భవనం 96ఏళ్ల పాటు సేవలందించింది. ఎన్నో చారిత్రక నిర్ణయాలకు సాక్ష్యంగా నిలిచింది. ఎన్నో చట్టాలు ఈ భవనంలో రూపొందాయి.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ ఏడాది మేలో ప్రధాని ప్రారంభించారు. ఈ భారీ భవనం లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది సభ్యులు, రాజ్యసభ ఛాంబర్‌లో 300 మంది సభ్యులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి 12వందల 80 మంది ఎంపీలకు లోక్‌సభ ఛాంబర్‌లో వసతి కల్పించారు. త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల భవనం 64వేల 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. దీనికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అవి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు ప్రత్యేక ప్రవేశాల ద్వారాలు ఉన్నాయి.