No-Confidence Motion:


అవిశ్వాస తీర్మానంపై చర్చకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంగీకరించింది. 17 గంటల పాటు చర్చించేందుకు అనుమతినిచ్చింది. ఈ తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10వ తేదీన స్పందించనున్నారు. ఆగస్టు 8,9వ తేదీల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఆగస్టు 10న దీనిపై ప్రధాని మోదీ బదులిస్తారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ చర్చించాల్సిందే అని పట్టుపడుతున్నాయి విపక్షాలు. దీనిపై కేంద్రం సరిగా స్పందించడం లేదని భావించిన ఆ పార్టీలు మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌తో పాటు బీఆర్ఎస్ ఎంపీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి దీనిపై చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ఆమోదం తెలిపిన లోక్‌సభ స్పీకర్...17 గంటల పాటు చర్చించేందుకు అంగీకరించారు. వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి మణిపూర్‌ అల్లర్ల అంశంపైనే పార్లమెంట్‌లో మారుమోగుతోంది. 


సుప్రీంకోర్టు విచారణ...


మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బాధిత మహిళల తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించగా..కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ వాదించారు. ఈ కేసుని సీబీఐ విచారించాలన్న కేంద్రం అభిప్రాయాన్ని బాధితులు అంగీకరించడం లేదని కపిల్ సిబాల్ కోర్టుకి వెల్లడించారు. అదే సమయంలో అసోం రాష్ట్రానికి కేసు బదిలీ చేయాలన్న విషయంలోనూ వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. దీనిపై సొలిసిటర్ జనరల్ స్పందించారు. అసోంకి కేసుని బదిలీ చేయాలని తాము చెప్పలేదని, కేవలం వేరే రాష్ట్రం అని మాత్రమే ప్రస్తావించామని తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం కేంద్రానికి పలు ప్రశ్నలు వేసింది. మే 3వ తేదీ నుంచి అల్లర్లు మొదలయ్యాయని అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని FIRలు నమోదు చేశారో చెప్పాలని ఆదేశించింది. అసలు ఈ వీడియో బయటకు వచ్చేంత వరకూ ఏం చేస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కమిటీలో మాజీ మహిళా న్యాయమూర్తులు ఉంటారని ధర్మాసనం స్పష్టం చేసింది. వీడియో బయటకు వచ్చి 14 రోజులవుతోందని, ఇప్పటి వరకూ పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. దీనిపై పూర్తిస్థాయిలో ఓ రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించింది.


మైతేయిల పిటిషన్ తిరస్కరణ..


మణిపూర్‌ హింసాకాండపై సిట్‌ని ఏర్పాటు చేసి విచారించాలన్న మైతేయిల పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేవలం ఓ వర్గాన్ని దోషిగా చూపించే పిటిషన్‌లను విచారించలేమని తేల్చి చెప్పింది. ఈ అల్లర్లతో పాటు నార్కో టెర్రరిజం, గసగసాల సాగుపైనా విచారణ జరపాలని పిటిషన్‌లో కోరారు మైతేయి తరపున పిటిషన్ వేసిన న్యాయవాది. అయితే సుప్రీంకోర్టు మాత్రం మరింత కచ్చితమైన అంశాలను పిటిషన్‌లో ప్రస్తావించాలని, కేవలం ఓ కమ్యూనిటీని తప్పుపట్టడం సరికాదని స్పష్టం చేసింది. మైతేయిల తరపున పిటిషన్ వేసిన సీనియర్ అడ్వకేట్ మాధవి దివాన్‌ని...ఉపసంహరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.


Also Read: M Karunanidhi: తమిళనాడు సీఎంకు సుప్రీం కోర్టులో ఊరట-మెరినా బీచ్‌లో కరుణానిధి స్మారక చిహ్నం పెన్‌ నిర్మాణానికి అనుమతి