Pandit Laxmikant Dixit passed away |  లక్నో: యూపీలోని అయోధ్యలో రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుక నిర్వహించిన ప్రధాన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 86 ఏళ్లు. కాగా, గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారణాసిలో శనివారం ఉదయం 6:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జనవరి నెలలో అయోధ్యలోని రామ మందిరంలో రామ్‌లల్లా ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమం ప్రధాన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ చేతుల మీదుగా జరిగిందని తెలిసిందే. బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన పూజారి కన్నుమూశారని తెలియడంతో భక్తులు సంతాపం ప్రకటిస్తున్నారు. పలువురు రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా, ఇతర రంగాల ప్రముఖులు లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ కు నివాళులర్పిస్తున్నారు.


ప్రధాని మోదీ సంతాపం
అయోధ్య ఆలయం ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘దేశంలోని ప్రముఖ పూజారి, సంగవేద పాఠశాలలో యజుర్వేద గురువు అయిన లక్ష్మీకాంత్ దీక్షిత్ గారు కన్నుమూశారనే బాధాకర వార్త తెలిసింది. కాశీలోని పండితులలో ఆయన ప్రముఖుడు. కాశీ విశ్వనాథ్ టెంపుల్, అయోధ్య రామాలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలలో పాలు పంచుకున్న లక్ష్మీకాంత్ దీక్షిత్ లేని లోటు పూడ్చలేనిది’ అని ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేసుకున్నారు. 






వారణాసికి చెందిన వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్. హిందూ సమాజంలో ప్రముఖ వ్యక్తి ఆయన. జవనరిలో అయోధ్య రామాలయంలో వేడుకను నిర్వహించిన 121 మంది పండితుల బృందానికి ప్రధాన అర్చకుడిగా నేతృత్వం వహించిన గౌరవం దక్కించుకున్నారు. కొందరు ఈయనను 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కాశీ పండితుడు గాగా భట్ వారసుడు అని పేర్కొంటారు. దాదాపు 350 ఏళ్ల కిందట 1674లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిపించిన పండితుడే గాగా భట్. ఆయన వంశానికి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ పలు ప్రధాన వేడుకలకు సాక్షిగా నిలిచారు.


ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని నష్టం: యోగి ఆదిత్యనాథ్
పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. కాశీ పండితుడు, అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట నిర్వహించిన దీక్షితులు కన్నుమూశారన్న వార్త తననెంతగానో బాధించిందన్నారు. ఆయన శిష్యులు, అనుచరులకు మరింత శక్తిని అందించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.


Also Read: భూమ్మీద మొదటి నగరం కాశీ..చివరి నగరం కూడా ఇదే - మనిషిని విశ్వంలో ఐక్యం చేసే వారణాసి సృష్టి ఎలా జరిగిందో తెలుసా!