History of Varanasi: విశ్వం మొత్తం నీటితో నిండి ఉన్న సమయం అది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న పరమార్థం మేరకు పంచభూతాధిపతి అయిన పరమేశ్వరుడు సృష్టిని ప్రారంభించాలి అనుకున్నాడు. అప్పటివరకూ భూమిలేదు, సృష్టి చేయడానికి బ్రహ్మ లేడు, మునులు లేరు. శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి పుట్టిన గంగతో సమస్త విశ్వం నిండిపోయింది. అలాంటి సమయంలో తన త్రిశూలంతో నీటితో నిండిన ప్రదేశం నుంచి కొంత భాగాన్ని తీసి పైకెత్తి పట్టుకున్నాడు శివుడు. త్రిశూలాన్ని కాశిక అంటారు..అందుకే శివుడు తన త్రిశూలంతో పైకెత్తి పట్టుకున్న ప్రదేశం కావునే కాశీగా పిలుస్తారు. అలా సృష్టిలో మొదటగా పుట్టిన నగరమే కాశీ.
మొదటి నగరం - చివరి నగరం కూడా కాశీనే!
శ్రీ మహావిష్ణువు నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు...త్రిశూలంపై ఉన్న భూభాగం నుంచే సృష్టి ప్రారంభించాడు. దేవతలు, రుషులు అంతా శివుడిని విన్నవించుకోవడంతో త్రిశూలంపైనున్న భాగాన్ని అలాగే కిందకుదించాడు. అంటే చుట్టూ నీరున్నా వారణాసి నగరం మాత్రం అలాగే ఉంది. ఎప్పటివరకూ అంటే...బ్రహ్మదేవుడి సృష్టి ప్రళయకాలంలో ముగిసిపోయినా కానీ కాశీ పట్టణం మాత్రం చెక్కుచెదరదు. అందుకే సృష్టిలో మొదటి నగరం మాత్రమే కాదు..చివరి నగరం కూడా కాశీనే అని బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది.
Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!
మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరం
మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరం కాశీ. అందుకే ప్రతి భక్తుడి చివరి మజిలీ కాశీ అవుతుంది..అక్కడకు వెళ్లినవారికి తిరిగి రావాలని అనిపించకపోవడానికి కారణం ఇదే. దీనిని ముక్తి నగరం అని చెప్పడం వెనుక మరో కారణం ఉంది...కైలాసంలో సన్యాస జీవితాన్ని గడిపిన పరమేశ్వరుడు..పార్వతీదేవితో పరిణయం తర్వాత కాశీని నివాసంగా చేసుకున్నాడు. కొంతకాలం పాటూ తాను సృష్టించిన నగరంలోనే ఉన్నాడు. నగరాన్ని మరింత తీర్చిదిద్దమని దివోదాసు అనే మహారాజుకి అప్పగించాడు. అయితే శివుడి చుట్టూ ఉండే దేవగణం కారణంగా పాలించలేకపోతున్నానని దివోదాసు చెప్పాడు. అప్పడు శంకరుడు సతీసమేతంగా అక్కడి నుంచి తరలివెళ్లినా కాశీపైనే మనసులగ్నమై ఉంది. ఆ నగరాన్ని చూసి రమ్మని తన దూతలని..తర్వాత గణేషుడిని, బ్రహ్మని ఇలా ఒక్కొక్కర్నీ పంపిస్తే..ఆ పట్టణానికి వెళ్లగానే మంత్రముగ్ధులై ఉండిపోయారు. చివరకు తన గణాలను పంపిస్తే అవి కూడా అక్కడ ద్వారపాలకులిగా మారిపోయాయి. ఆ తర్వాత నేరుగా శివుడే తరలి వచ్చి కాశీని నివాసంగా చేసుకుని ఉండిపోయాడని శివపురాణంలో ఉంది. అయితే అందరూ కాశీలో ఉండిపోవాలి అనుకున్నది సుఖసౌఖ్యాల కోసం కాదు.. బంధాలు దాటి విశ్వంతో అనుబంధం ఏర్పరుచుకోవాలని...
Also Read: కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!
భూమి పుట్టక ముందే పుట్టిన నగరం
ఐదువేల ఏళ్ల క్రితమే కాశి నగరం ప్రస్తావన వేదాల్లో, ఇతిహాసాల్లో ఉంది. అయితే ఈ క్షేత్రంలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. యోగశాస్త్రం ప్రకారం మనిషి శరీరంలో 72 నాడులుంటాయి...వాటికి ప్రతీకగా ఇక్కడ 72 వేల గుడులు ఉండేవి. ఇప్పటికీ
జరుగుతున్న ఎన్నో పరిశోధనల్లో కాశీ క్షేత్రంలో ఏ మూలన కట్టడాలు పరిశీలించినా అక్కడ ఆలయాలు ఉన్న ఆనవాళ్లు కనిపిస్తాయి.
స్వర్గాన్ని మించిన నగరం
కాశీ నగరం గురించి శ్రీనాథుడు రచించిన 'కాశీ ఖండం'లో ఇలా ఉంది...
ఒక వర్ష శతంబున నొం
డొక తీర్ధము నందు గల ప్రయోజన లాభము
బొక దివసంబున నానం
ద కాననము నందు సర్వదా సిద్ధించున్!
వేరే తీర్థంలో నూరేళ్లు ఉంటే లభించే ప్రయోజనం.. కాశీ క్షేత్రంలో ఒక్కరోజు ఉన్నా సిద్ధిస్తుందని దీని అర్థం. కాశీ ముందు స్వర్గం కూడా సరితూగదన్నాడు శ్రీనాథుడు.
Also Read: రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!
విశ్వానికి ఆది నగరంలో విశ్వనాథుడు
విశ్వానికి ఆది అయిన నగరం కాబట్టే ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు విశ్వనాథుడిగా వెలిశాడు. అందుకే కాశీ అంత గొప్ప క్షేత్రం. ప్రళయం వచ్చినా సృష్టి అంతం అయినా...యుగాంతం వచ్చినా కాశీ నగరం అలాగే ఉండిపోతుందని స్కాంద పురాణంలో ఉంది..
Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!