Rahul Gandhi Sensational Comments: బీజేపీ హయాంలో దేశంలో భయానక వాతావరణం నెలకొందని.. రైతులు, మహిళలు, యువత అంతా భయపడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. లోక్ సభలో సోమవారం బడ్జెట్‌పై ప్రసంగం సందర్భంగా మాట్లాడిన ఆయన.. మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'వేల ఏళ్ల క్రితం హర్యానాలోని కురుక్షేత్రలో పద్మవ్యూహంలో అభిమన్యుడిని ట్రాప్ చేసి చంపారు. చక్రవ్యూహం లోపల హింస, భయం కారణంగా అభిమన్యుడు చనిపోయాడు. 21వ శతాబ్ధంలో పద్మవ్యూహం లాంటి కమలం పార్టీ రూపంలో దేశంలో అధికారంలో ఉంది. రైతులు, కార్మికులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాలనూ బీజేపీ భయపెడుతోంది. అప్పుడు ఆరుగురు పద్మవ్యూహాన్ని కంట్రోల్ చేశారు. ఇప్పుడు మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ వంటి వారు కంట్రోల్ చేస్తున్నారు.' అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
కేంద్ర బడ్జెట్‌లో మధ్య తరగతి వారిపై భారం మోపారని.. ఎన్డీయే ప్రభుత్వం అంబానీ, అదానీలకు మాత్రమే మేలు చేకూరేలా వ్యవహరిస్తోందని రాహుల్ మండిపడ్డారు. కేంద్ర విధానాలతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. 'రాజకీయ ఏకస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోంది. ట్యాక్స్ టెర్రరిజం ఆపేందుకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఇంటర్న్‌షిప్స్ వల్ల యువతకు ఒరిగిందేమీ లేదు. అగ్నివీరులను కేంద్రం మోసం చేస్తోంది. ఈ బడ్జెట్‌లో అగ్నివీర్‌ల పెన్షన్ కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. పంటలకు కనీస మద్దతు ధర కావాలని రైతులు కోరుతున్నా.. ఇప్పటికీ కేంద్రం స్పష్టత లేదు. రైతు సంఘాలతో మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. పేపర్ లీకేజీతో యువత తీవ్రంగా నష్టపోయారు. పదేళ్లలో 70సార్లు ప్రశ్న పత్రాన్ని లీక్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చే పరిస్థితులు లేవు. విద్యపై కేవలం 2.5 శాతం బడ్జెట్ మాత్రమే కేటాయించారు.' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'హల్వా' పోస్టర్ - తల బాదుకున్న నిర్మలమ్మ
ఈ క్రమంలో రాహుల్ గాంధీ 'హల్వా' వేడుక గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్న 'హల్వా' వేడుకకు సంబంధించిన పోస్టర్‌ను సభలో ప్రదర్శించారు. ఈ ఫోటోలో దళిత, ఆదివాసీ, ఓబీసీలకు చెందిన అదికారిని చూడలేదని.. అలాంటి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఏం ప్రయోజనం చేకూరుస్తుందని మండిపడ్డారు. 20 మంది అధికారులు బడ్జెట్ సిద్ధం చేశారని చెప్పారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలకు సభలో ఉన్న నిర్మలమ్మ తల బాదుకున్నారు. సభలో పోస్టర్ ప్రదర్శించడంపై స్పీకర్ ఓంబిర్లా అభ్యంతరం తెలిపారు.
సభలో గందరగోళం
రాహుల్ వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేగింది. అధికార బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు పారిశ్రామికవేత్తలు దేశంలోని మౌలిక సదుపాయాలను నియంత్రిస్తున్నారని.. వారి పేర్లను సభలో ప్రస్తావించడంపై స్పీకర్ ఓంబిర్లా అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ వాదన సాగింది. రాహుల్ గాంధీకి సభా నియమాలు తెలియవంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు.
Also Read: KTR: ఢిల్లీలో సివిల్ సర్వీస్ అభ్యర్థుల మృతి, తెలంగాణ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన కేటీఆర్