Tanya Soni: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరద నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగించింది. భారీ వర్షానికి రావూస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ గ్రంథాలయంలోకి వరద చొచ్చుకుపోయింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులను తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25), నవీన్ డాల్విన్ (24)గా గుర్తించారు. వీరిలో తాన్యా కుటుంబం ప్రస్తుతం తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో నివసిస్తోంది. తాన్యా కుటుంబ స్వస్థలం బీహార్‌లోని ఔరంగాబాద్ కాగా.. ఆమె తండ్రి విజయ్ కుమార్ మంచిర్యాలలోని సింగరేణి డీజీఎంగా పని చేస్తున్నారు. శ్రేయాది యూపీ కాగా, నవీన్ కేరళ నుంచి వచ్చి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు.
'మా బిడ్డ చిన్ననాటి కల'
సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి దేశానికి సేవ అందించాలనేది తమ బిడ్డ చిన్ననాటి కల అని తాన్యా సోని తండ్రి విజయ్ కుమార్ తెలిపారు. సోని మృతి పట్ల ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 'ఢిల్లీలోనే రాజనీతి శాస్త్రంలో తాన్యా బీఏ పట్టా పొందారు. నెల రోజుల కిందటే ఆమె సివిల్స్ శిక్షణలో చేరారు. మా కుటుంబం లఖ్‌నవూ వెళ్తుండగా ఈ దుర్వార్త తెలిసింది. నాగ్‌పుర్‌లో రైలు దిగి విమానంలో ఢిల్లీ చేరుకున్నాం. తాన్యా మృతదేహంతో మా స్వరాష్ట్రమైన బీహార్‌కు బయలుదేరాం.' అని విజయ్ కుమార్ ఓ జాతీయ మీడియాకు ఆవేదనతో వెల్లడించారు.
సీఎం దిగ్భ్రాంతి
ఢిల్లీలో విద్యార్థుల మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. కిషన్ రెడ్డి విద్యార్థిని సోని తండ్రికి ఫోన్ చేసి ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.
ఏడుగురు అరెస్ట్
మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. తాజాగా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. అటు, ఓల్డ్ రాజేందర్ నగర్‌లో అక్రమంగా నిర్వహిస్తోన్న సుమారు 13 కోచింగ్ సెంటర్లను గుర్తించిన అధికారులు వాటిపై చర్యలు చేపట్టారు. సెల్లార్లలో అక్రమంగా నిర్వహిస్తోన్న కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు.
వీడియోలు వైరల్
మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోచింగ్ సెంటర్ భవనం ముందు భారీగా వరద నీటిలో నుంచి ఓ ఫోర్ వీలర్ వాహనం దూసుకుపోగా.. నీటి అలల ధాటికి గేటు విరిగి వరద సెల్లార్‌లోకి ప్రవహించినట్లు ఆ వీడియోలో ఉంది. అలాగే, ప్రమాదానికి ముందు తీసిన మరో వీడియో సైతం వైరల్‌గా మారింది. వరద నీరు బేస్మెంట్‌లోకి ప్రవేశించడంతో లోపల ఉన్న విద్యార్థులు నీటిలో నుంచి బయటకు వస్తున్నట్లుగా అందులో ఉంది. మృతి చెందిన విద్యార్థులు బయటకు వచ్చే లోపే వరద చుట్టుముట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన స్టడీ సెంటర్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.