KTR about Delhi IAS Coaching Centre Tragedy: ఢిల్లీలో శనివారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా పాత రాజేంద్రనగర్‌లోని రావు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ నీటమునిగింది. నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ విషయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీలోని బేస్ మెట్ వరదల్లో చిక్కుకున్న ముగ్గురు సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల విషాద మరణం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతి చెందాను. బాధితుల్లో ఒకరైన తానియా సోని తెలంగాణకు చెందిన విద్యార్థిని. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. తెలంగాణ సిఎంఓను నేను హెచ్చరించాలనుకుంటున్నాను. హైదరాబాద్, అన్ని ఇతర ప్రధాన పట్టణాలలో అన్ని నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.’’ అంటూ రాసుకొచ్చారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి
ఢిల్లీలో ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వారిలో సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే 25ఏళ్ల యువతి ఉండడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు చెప్పారు. వెంటనే మృతురాలు సోని తండ్రి విజయ్ కుమార్‌ను ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భారీ వర్షాలు.. బతుకులు అతలాకుతలం
ఢిల్లీలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వానలతో ఢిల్లీ ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. అయితే భారీ వర్షాలకు ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరదనీరు చేరింది. బేస్మెంట్‌లోని లైబ్రరీలో ముగ్గురు విద్యార్థులు చదువుకుంటుండగా ఒక్కసారిగా నీరు ముంచెత్తింది. ఎటూ వెళ్లలేని స్థితిలో విద్యార్థులు నీట మునిగి మృతిచెందారు. దీంతో సహచర విద్యార్థులు డయల్ 100కు ఫోన్ చేశారు. రాత్రి 7 గంటలకు సమాచారం అందడంతో ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అర్థరాత్రి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను బయటికి తీశారు. మరో 14 మంది విద్యార్థులను రక్షించారు. శనివారం రాత్రి భవనంలో విద్యుత్ కోత కారణంగా బేస్‌మెంట్ లైబ్రరీ బయోమెట్రిక్ గేటు జామ్ అయింది. విద్యార్థులు చీకట్లో లైబ్రరీలో చిక్కుకున్నారు. మొదట్లో గేటు మూసి ఉండడంతో బేస్ మెట్లోకి నీరు రాలేదు. సమయం గడుస్తున్నా కొద్ది నీటి ఒత్తిడి పెరగడంతో గేటు విరిగిపోయింది. దీంతో కొన్ని నిమిషాల్లోనే బేస్‌మెంట్‌లో నీరు వేగంగా నిండడం ప్రారంభించింది.
రెండు నిమిషాల్లోనే నిండిన సెల్లార్
ప్రవాహం ఉధృతంగా ఉండడంతో మెట్లు ఎక్కడానికి ఇబ్బందిగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొద్ది సెకన్లలోనే మోకాళ్ల లోతుకు నీరు చేరింది. దీంతో విద్యార్థులు బెంచ్‌పై నిలబడ్డారు. కేవలం 2-3 నిమిషాల్లో బేస్ మెట్ మొత్తం 10-12 అడుగుల నీటితో నిండిపోయింది. అనంతరం విద్యార్థులను కాపాడేందుకు తాళ్లు విసిరినా నీరు మురికిగా ఉండడంతో తాడు కనిపించలేదు. దీంతో విద్యార్థులు నీటమునిగి ఊపిరి ఆడక చనిపోయినట్లు ఇతర విద్యార్థులు చెబుతున్నారు. . చనిపోయిన విద్యార్థుల మృతదేహాలను వెలికితీసిన తర్వాత వారి వివరాలు సేకరించారు. తెలంగాణకి చెందిన తానియా సోని (25), ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన శ్రేయ యాదవ్ (25), కేరళకి చెందిన నెవిన్ డాల్విన్ (28) గా గుర్తించారు.
ఐఏఎస్ కావాలన్నది సోని లక్ష్యం
కాగా, వీరిలో తానియా సోని తల్లిదండ్రులు సికింద్రాబాద్ కి చెందినవారు. సోనీ తండ్రి విజయ్ కుమార్ సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. వృత్తిరీత్యా ప్రస్తుతం మంచిర్యాలలో ఉంటున్నారు. శ్రీరాంపూర్ -1 లో భూగర్భగని మేనేజర్ గా పని చేస్తున్నారు. ఏడాది క్రితం ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో తానియా సోని కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయింది. దురదృష్టవశాత్తు వరదలో చిక్కుకుని కన్నుమూశారు. కుమార్తె మృతదేహాన్ని మంచిర్యాలకు తీసుకురావడానికి ఇప్పటికే సోనీ తల్లిదండ్రులు న్యూఢిల్లీకి చేరుకున్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం
సివిల్ సర్వీస్ అభ్యర్థుల మృతి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కోచింగ్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం ఇద్దరినీ ఢిల్లీ కోర్టుకు హాజరుపరిచారు. మంగళవారంలోగా నివేదిక సమర్పించాలని డివిజనల్ కమిషనర్‌ను ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా కోరారు. అలాగే ఈ ఘటనపై విచారణ ప్రారంభించి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిషి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్‌ను ఆదేశించారు. ఈ సంఘటన ఎలా జరిగిందో దర్యాప్తు చేయడానికి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారెవరూ తప్పించుకోలేరని అతిషి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
రావ్ స్టడీ సెంటర్ యజమాని అరెస్ట్..
రావ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఓనర్ అభిషేక్ గుప్తా, కో-ఆర్డినేటర్ దేశ్ పాల్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. రావ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు సెల్లార్ లో తమ విద్యార్థుల కోసం లైబ్రరీ ఏర్పాటు చేశారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత 2021లో తీసుకున్న సర్టిఫికెట్ లో సెల్లార్ ను పార్కింగ్ కోసం మాత్రమే వినియోగిస్తామని భవన యజమాని రాసిచ్చాడని, అయితే అందులో లైబ్రరీని ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ పేర్కొన్నారు.
కట్టలు తెంచుకున్న ఆగ్రహం
ఢిల్లీ కోచింగ్ ప్రమాదం తర్వాత విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. క్రోర్‌బాగ్ మెట్రో స్టేషన్ దిగువన విద్యార్థులు రహదారిని దిగ్బంధించారు. అక్కడ ఐఏఎస్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు భారీగా గుమిగూడారు. విద్యార్థులు రోడ్డుపై కూర్చొని రాకపోకలను నిలిపివేశారు. విద్యార్థులంతా వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదంపై విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.