INDIA Meeting: 


వ్యూహాలపై కసరత్తు..


మోదీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన INDIA కూటమి ఎన్నికల వ్యూహాలపై కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే యూపీఏ పేరుని తొలగించి కొత్త పేరుతో ముందుకొచ్చింది. 26 పార్టీలు ఇందులో చేరాయి. రెండు సార్లు సమావేశమయ్యాయి ఈ పార్టీలు. ఇప్పుడు మూడోసారి భేటీ కానున్నాయి. ఈ నెల 31, ఆగస్టు 1వ తేదీల్లో ముంబయి వేదికగా మీటింగ్ జరగనుంది. చివరిసారి జులై 17,18వ తేదీల్లో బెంగళూరులో ఈ పార్టీల కీలక నేతలు సమావేశమయ్యారు. ఆ సమయంలోనే UPAని INDIA గా మార్చుతూ కీలక ప్రకటన చేశారు. తొలిసారి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో పట్నాలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే కూటమి కన్వీనర్ పేరుని ప్రకటించే అవకాశాలున్నాయి. ఇండియా పేరుతో కూటమి కట్టినా...ఇప్పటి వరకూ దీన్ని లీడ్ చేసేది ఎవరు అన్నది క్లారిటీ ఇవ్వలేదు నేతలు. గతంలో చాలా సందర్భాల్లో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు వినిపించింది. ఆయన పేరు దాదాపు ఖరారైనట్టే అనుకున్నారంతా. కానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు ఇండియా కూటమి. అందుకే..NDA పదేపదే ఇండియా కూటమిపై విమర్శలు చేస్తూనే ఉంది. లీడర్ లేని సైన్యం దేనికంటూ సెటైర్లు వేస్తోంది. ఇప్పటికైనా వీటికి చెక్ పెడుతూ కన్వీనర్ పేరుని ప్రకటించాలని భావిస్తోంది ఇండియా కూటమి. అటు ప్రధాని మోదీ మాత్రం ఇండియా కూటమిపై విమర్శలు ఆపడం లేదు. అది ఇండియా కూటమి కాదని, ఘమండియా (పొగరు) కూటమి అంటూ తీవ్రంగానే విరుచుకు పడుతున్నారు. 


రెండో సమావేశం జరిగిన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. 11 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇండియా కూటమిలో పార్టీల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా చూడడమే ఈ కమిటీ పని. ఇదే కమిటీ కన్వీనర్ పేరునీ ప్రకటించే అవకాశముంది. 


కూటమిపై కేసు..


దేశంలో విపక్ష పార్టీలు అన్నీ కలిసి కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టుకోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై పోలీస్ కేసు కూడా నమోదైంది. కాంగ్రెస్ పార్టీ సహా మొత్తం 26 రాజకీయ పార్టీలు దేశం పేరును తప్పుడు ప్రయోజనం కోసం వాడుకుంటున్నాయని డాక్టర్ అవినాష్ మిశ్రా అనే వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలోని బరాఖంబా పోలీస్ స్టేషన్ లో ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 1950 నాటి ఎంబ్లమ్స్ యాక్ట్‌లో పొందుపరిచిన అంశాల ఆధారంగా ప్రతిపక్ష కూటమి ఆమోదించుకున్న పేరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పేరు సదరు చట్టానికి విరుద్ధంగా ఉందని ఆయన వివరించారు. దీనిపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు.I - ఇండియా, N - నేషనల్, D - డెమొక్రాటిక్, I - ఇంక్లూజివ్, A - అలయెన్స్ (INDIA)గా నూతన కూటమికి పేరు పెట్టారు. 


Also Read: రాహుల్‌ గాంధీకి బిగ్ రిలీఫ్- పరువు నష్టం దావా కేసులో సుప్రీంకోర్టు స్టే