India-Bharat Name Row:


"భారత్‌" వివాదంపై ఒమర్ వ్యాఖ్యలు..


ఇండియా పేరుని భారత్‌గా మార్చుతున్నారన్న వాదన గట్టిగానే నడుస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కచ్చితంగా ఈ చర్చ జరుగుతుందన్న వార్తలూ వినిపిస్తున్నాయి. విపక్షాలు మాత్రం కేంద్రంపై గట్టిగానే విమర్శలు చేస్తున్నాయి. సమస్యల్ని పక్కదోవ పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండి పడుతున్నాయి. ఈ వివాదంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీపై విరుచుకు పడ్డారు. ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగాన్ని మార్చాలని తేల్చి చెప్పారు. బీజేపీకి నిజంగా ధైర్యం ఉంటే...రాజ్యాంగాన్ని మార్చాలని సవాల్ విసిరారు. రాజ్యాంగాన్ని మార్చే విషయంలో ఎవరు బీజేపీకి మద్దతుగా ఉంటుందో చూస్తామని అన్నారు. ఎవరూ ఇండియా పేరుని మార్చలేరని స్పష్టం చేశారు. 


"ఎవరూ ఇండియా పేరుని మార్చలేరు. వాళ్లకు పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ ఉందా..? అలా ఉంటే మార్చుకోమనండి. అయినా దేశం పేరుని మార్చడం అంత సులభం కాదు. ఇది జరగాలంటే దేశ రాజ్యాంగాన్నీ మార్చాలి. నిజంగా మీకు (బీజేపీ) ధైర్యం ఉంటే ఆ పని చేసి చూడండి. ఎవరు మీకు మద్దతునిస్తారో మేమూ చూస్తాం"


- ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి 






రాజ్యాంగంలో ఇండియా ఉంది..


రాజ్యాంగంలో భారత్‌తో పాటు ఇండియా పేరు కూడా ఉందని, దాన్ని ఎవరూ తొలగించలేరని తేల్చి చెప్పారు ఒమర్ అబ్దుల్లా. ప్రజలు ఎలా పిలవాలన్నది వాళ్ల హక్కు అని, ప్రధాని మోదీకి ఆ పేరు నచ్చకపోతే వదిలేయొచ్చని అన్నారు. 


"మన దేశ రాజ్యాంగంలో భారత్ అనే పేరుతో పాటు ఇండియా అనే పేరు కూడా ఉంది. రెండు పేర్లూ ఉన్నాయి. కొందరు ఇండియా అంటారు. మరి కొందరు భారత్, హిందుస్థాన్ అని పిలుచుకుంటారు. ఎలా పిలుచుకోవాలన్నది ప్రజల హక్కు. ఒకవేళ ఇండియా అనే పదం ప్రధాని మోదీకి నచ్చకపోతే వదిలేయొచ్చుగా. కానీ రాజ్యాంగంలో నుంచి ఆ పదాన్ని తొలగించలేరు"


- ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి  


యూరప్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇండియా పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమికి I.N.D.I.A అనే పేరు పెట్టడం వల్లే బీజేపీ భారత్‌ అనే పేరు పెట్టాలనుకుంటోందని విమర్శించారు. బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్‌కి ఇదే నిదర్శనమని మండి పడ్డారు రాహుల్. ఇండియా అంటేనే భారత్ అని, మళ్లీ పేరు మార్చాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ప్రభుత్వం భయపడుతోందనడానికి, ఈ పేరు మార్పు రాజకీయాలే ఉదాహరణ అని అన్నారు. 


"ఇండియా అంటే భారత్. ఈ పేరు బాగానే ఉంది. ఇదే మనమేంటో ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ మోదీ ప్రభుత్వానికి ఎక్కడో ఓ భయం పట్టుకుంది. మేం I.N.D.I.A అని పేరు పెట్టుకోగానే వెంటనే దేశం పేరు మార్చాలని ప్రతిపాదించింది. కేవలం భయంతో వచ్చిన ప్రతిపాదనే ఇది. ఇవి డైవర్షన్ పాలిటిక్స్. అదానీ వ్యవహారం గురించి మేం మాట్లాడిన ప్రతిసారీ వేరే కొత్త టాపిక్‌ తెరపైకి తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ


Also Read: ఢిల్లీ డిక్లరేషన్ సిద్ధంగా ఉంది, ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌ డాక్యుమెంట్ ఇదే - అమితాబ్ కాంత్