జీ 20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో పలు దేశాధినేతలు ఈరోజు సాయంత్రం కల్లా దిల్లీకి చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు బయలుదేరారు. ఈరోజు రాత్రి ఏడు గంటల కల్లా బైడెన్ దిల్లీకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారిగా భారత్ వస్తున్ఆరు. అయితే బైడెన్ ఇక్కడికి చేరుకోగానే నేరుగా లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లనున్నారని సంబంధిత వర్గాల సమాచారం. సదస్సు ప్రారంభానికి ముందు రోజే అంటే శుక్రవారం సాయంత్రమే మోదీ తన నివాసంలో జో బైడెన్‌కు ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు.
ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశాల అనంతరం మోదీ నివాసంలో విందు చేయనున్నట్లు సమాచారం. బిజీ షెడ్యూల్‌లోనూ మోదీ బైడెన్‌కు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. మూడు నెలల క్రితం ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా బైడెన్ అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌లో మోదీకి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. నేటి సమావేశంలో బైడెన్, మోదీ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా జీఈ జెట్ ఇంజిన్ ఒప్పందం, పౌర అణు సాంకేతికతపై అర్థవంతమైన చర్చలు జరగనున్నాయని, వీటిపై పురోగతి సాధించే అవకాశముందని భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ వెల్లడించినట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది. జెట్ ఇంజిన్లకు సంబంధించిన స్వదేశీ సాంకేతికతను భారత్‌కు బదిలీ చేసేందుకు ఏప్రిల్‌లో జీఈ అంగీకరించింది. అలాగే ఇరువురు నేతలు క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, ఆధునిక సాంకేతికత, డిఫెన్స్ రంగంలో సహకారం, ప్రపంచం ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను ఎదుర్కోవడంలో ఇరు దేశాలు ఎలా దోహదరపడతాయో అనే అంశాలపై సమీక్షించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికా నుంచి భారత్ బయలుదేరే ముందు బైడెన్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో జీ 20 సదస్సుకు వెళ్తున్నట్లు పోస్ట్ చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సహకారం తమ ప్రధానాంశమని, అమెరికన్ల ప్రాధాన్యతలపై పురోగతి సాధిండం మీద దృష్టి సారిస్తామని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాటిని తెలియజేస్తామని, అలాగే జీ 20 సదస్సు పట్ల తమ నిబద్ధతను చాటుతున్నామని ట్వీట్ చేశారు.
దాదాపు 19 దేశాల నుంచి సమావేశాల కోసం దేశాధినేతలు, ప్రతినిధులు నేడు దేశ రాజధాని దిల్లీకి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి చాలా బిజీ షెడ్యూల్ ఉంది. పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దాదాపుగా మొత్తం 15 రౌండ్ల చర్చలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు మోదీ అమెరికా అధికారులతో పాటు మారిషస్, బంగ్లాదేశ్ ప్రతినిధులతోనూ చర్చించనున్నారు. రేపు (సెప్టెంబర్ 9)యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ నేతలతో సమావేశం కానున్నారు. ఇవాళ్టి సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో ప్రధాని భేటీ అవుతారు. ఇదే సమావేశంలో బంగ్లాదేశ్ ప్రధాని కూడా హాజరు కానున్నారు. సెప్టెంబర్ 10వ తేదీన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో లంచ్ మీటింగ్ షెడ్యూల్ చేశారు. అదే సమయంలో కెనడా దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కొమొరోస్, తుర్కియే (టర్కీ), యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. యురోపియన్ యూనియన్ దేశాలకు చెందిన కీలక నేతలు G20 Summit కి హాజరు కానున్నారు.