G20 Summit 2023: 


ఢిల్లీ డిక్లరేషన్..


G20 సదస్సుకి ముందు ఈ సమ్మిట్‌కి గైడ్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్ కాంత్ కీలక విషయాలు వెల్లడించారు. New Delhi Declaration ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు గ్లోబల్ సౌత్‌కి సంబంధించి ఎన్నో కీలక అంశాలు ఈ డాక్యుమెంట్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. Global South అంటే టెక్నికల్‌గా తక్కువ ఆదాయం ఉన్న దేశాల సముదాయం. అస్థిరమైన ప్రజాస్వామ్యం ఉన్న దేశాలనూ గ్లోబల్ సౌత్‌గానే పిలుస్తారు. ఈ దేశాల గొంతుక అయ్యే విధంగా న్యూ  ఢిల్లీ డిక్లరేషన్ ఉండనుందని అమితాబ్ కాంత్ వెల్లడించారు. ఈ డాక్యుమెంట్ దాదాపు సిద్ధమైపోయిందని, దీన్ని అందరు అధినేతలు చదివి అంగీకారం తెలిపిన తరవాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వివరించారు. 


"న్యూ ఢిల్లీ డిక్లరేషన్ సిద్ధమైపోయింది. దీని గురించి ఇప్పుడే పూర్తిగా మాట్లాడలేను. G20 సదస్సుకి వచ్చే లీడర్స్‌కి ఈ డాక్యుమెంట్‌ని అందిస్తాం. వాళ్లు యాక్సెప్ట్ చేసిన తరవాతే ఇందులోని అంశాల గురించి మాట్లాడగలం. అప్పటి వరకూ కాన్ఫిడెన్షియల్‌గానే ఉంచక తప్పదు. వసుధైక కుటుంబకం అనే నినాదంతోనే ఈ సదస్సుని లీడ్ చేయాలని భారత్ నిర్ణయించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే చెప్పారు. ఓ పద్ధతి ప్రకారం ఈ సమావేశాలు జరగాలని ముందే స్పష్టంచేశారు. ఆయన అంచనాలకు అనుగుణంగానే సమావేశాలు జరుగుతాయని ఆశిస్తున్నాం"


- అమితాబ్ కాంత్, భారత్ G20 ప్రతినిధి 






సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు..


సుస్థిరాభివృద్ధి, వాతావరణ మార్పులపై చర్చించాలనే ప్రధాన లక్ష్యాలతో భారత్ G20 సదస్సుకి అధ్యక్షత వహిస్తోందని స్పష్టం చేశారు అమితాబ్ కాంత్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా భారత్ పయనిస్తోందని 2030 నాటికి సాధించాల్సిన వాటిని కచ్చితంగా సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా చేయాల్సినవి ఉన్నాయని తేల్చి చెప్పారు. 


"వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాలన్నదే మా లక్ష్యం. అందుకే గ్రీన్ డెవలప్‌మెంట్‌పై భారత్‌ చర్చించనుంది. వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. ఇది జరగాలంటే అందుకు తగ్గ నిధులు కేటాయించాలి. దీనిపై చర్చ జరగనుంది"


- అమితాబ్ కాంత్, భారత్ G20 ప్రతినిధి