G20 Summit 2023: 



G20 సదస్సుకి అంతా సిద్ధం..


ఢిల్లీలో జరగనున్న G20 సదస్సుకి ప్రపంచ దేశాల అధినేతలతో పాటు కీలక నేతలు హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్‌తో పాటు మరి కొన్ని దేశాల లీడర్స్ ఢిల్లీకి తరలి వస్తున్నారు. సభ్య దేశాల అధినేతలందరికీ భారత్ ఆహ్వానం పంపినప్పటికీ కొందరు మాత్రం హాజరు కావడం లేదు. రకరకాల కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ఆయా దేశాలు ప్రకటించాయి. వీరిలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉన్నారు. జో బైడెన్ ఇప్పటికే ఢిల్లీకి బయల్దేరినట్టు అమెరికా వెల్లడించింది. 


ఎవరు వస్తున్నారు..?


1. G20 సదస్సుకి హాజరయ్యేందుకు ఢిల్లీకి వస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బెైడెన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం పడిందనే అంశంపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీంతో పాటు వాతావరణ మార్పులు, పేదరిక నిర్మూలన అంశాలపైనా చర్చించనున్నారు. 


2. యూకే ప్రధాని రిషి సునాక్ ఈ G20 సదస్సుకి హాజరు కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. భారత సంతతికి చెందిన ఆయన...బ్రిటన్ ప్రధాని అయ్యాక ఇండియాకి రావడం ఇదే తొలిసారి. 


3. జపాన్ ప్రధాని ఫుమియో కిషిద కూడా G20 సమావేశానికి వస్తున్నట్టు తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా పాల్పడుతున్న సైనిక చర్యను ఈ వేదికగా తీవ్రంగా ఖండించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించడమే ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు.


4.కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రస్తుతానికి ఇండోనేషియా పర్యటనలో ఉన్నారు. అయినా...G20 సదస్సుకి హాజరవుతానని ప్రకటించారు. ప్రధాని కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 


5.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా ఈ సదస్సుకి వస్తున్నారు. కేవలం G20 సమావేశాలే కాదు...ప్రత్యేకంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలూ జరపనున్నారు. 


6. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌ పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే భారత్‌లోని G20 సదస్సుకి హాజరు కానున్నారు. 


7. జర్మన్ ఛాన్స్‌లర్ ఒలఫ్ షోల్జ్‌తో పాటు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కూడా G20 సమావేశాలకు హాజరు కానున్నారు. ఉత్తర కొరియా పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని ఈ సదస్సులో చర్చించనున్నారు యూన్ సుక్. 


8. సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోస, టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్‌ G20 కి రానున్నారు. 


ఎవరు రావట్లేదు..?


1. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ G20 సమావేశాలకు హాజరు కావడం లేదని ప్రకటించింది చైనా. ఆయనకు బదులుగా ఆ దేశానికి ప్రతినిధిగా కీలక నేత లీ క్వియాంగ్ రానున్నారు. 2008లో తొలిసారి G20 సమావేశం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడు సదస్సు జరిగినా చైనా అధ్యక్షుడు హాజరయ్యారు. చైనా ప్రెసిడెంట్ రాకపోవడం ఇదే తొలిసారి. 


2. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చాలా సార్లు మాట్లాడారు ప్రధాని మోదీ. ఆ తరవాత చాలా పరిణామాలు జరిగాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు పాల్పడినందుకు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. విదేశాలకు వెళ్తే అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయన్న వాదనల నేపథ్యంలో ఆయన ఇండియాలోని G20 సదస్సుకి హాజరు కావడం లేదని ప్రకటించారు. 


3. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాన్‌షెజ్‌కి కరోనా సోకింది. అందుకే G20 సదస్సుకి హాజరు కాలేకపోతున్నానని వెల్లడించారు. మెక్సికో అధ్యక్షుడు యాండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఆబ్రడార్ కూడా హాజరు కావడం లేదు. 


Also Read: అటు G20 సమావేశాలు ఇటు ద్వైపాక్షిక చర్చలు, బిజీబిజీగా ప్రధాని మోదీ