G20 Summit 2023: 


ద్వైపాక్షిక చర్చలు..


G20 సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మొత్తం 15 రౌండ్ల చర్చలు జరగనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇవాళ (సెప్టెంబర్ 8) మారిషస్, బంగ్లాదేశ్ సహా అమెరికా ప్రతినిధులతో చర్చించనున్నారు. లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలోనే ఈ భేటీ జరగనుంది. రేపు (సెప్టెంబర్ 9) యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ నేతలతో సమావేశం కానున్నారు ప్రధాని. ఇవాళ్టి సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో ప్రధాని భేటీ అవుతారు. ఇదే సమావేశంలో బంగ్లాదేశ్ ప్రధాని కూడా హాజరు కానున్నారు. సెప్టెంబర్ 10వ తేదీన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో లంచ్ మీటింగ్‌ షెడ్యూల్ చేశారు. అదే సమయంలో కెనడా దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కొమొరోస్, తుర్కియే (టర్కీ), యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. యురోపియన్ యూనియన్ దేశాలకు చెందిన కీలక నేతలు G20 Summit కి హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలను పెద్ద ఎత్తున మొహరించారు. విమెన్ స్నైపర్స్‌ (Women Snipers)తో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. దాదాపు 50 వేల మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తోంది. ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్స్ వరకూ హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)తో పాటు కేంద్ర సంస్థలు National Security Guard (NSG), Central Armed Police Forces (CAPF) ఢిల్లీ పోలీసులకు సహకరిస్తున్నాయి.