Coromandel Express Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత పట్టాలపై పలు కాగితాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి


ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం (జూన్ 2) జరిగిన రైలు ప్రమాదం తర్వాత పట్టాలపై విధ్వంసం స్పష్టంగా కనిపించింది. శరీర భాగాలు, ప్రయాణికుల లగేజ్‌, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటి మధ్యే పేపర్లు పడి ఉన్నాయి. వాటిని చూసి వారి కళ్లు కన్నీళ్లతో నిండిపోతున్నాయి. ఈ పేపర్లపై చేతిరాతతో బెంగాలీ భాషలో రాసిన ప్రేమ కవితలు కనిపించాయి.


ఓ డైరీకి సంబంధించిన పేపర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో చేపలు, సూర్యుడు, ఏనుగుల చిత్రాలు వేసి ఉన్నాయి. వివిధ రూపాల్లో తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్టు అందులో ఉంది. ఓ ప్రయాణికుడు రాసుకున్న ప్రేమ కవితల్లా ఉన్నాయి. సెలవుల్లో  టూర్‌కి వెళ్లి ఇలా  ప్రేమ పేరుతో కవితలు రాసుకున్నాడేమో అని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఈ ప్రయాణికుడికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.


నిన్ను ఎల్లవేళలా ప్రేమించాలని ఉంది 


ఓ పేజీలో బెంగాలీ భాషలో రాసిన పంక్తులు ఇలా ఉన్నాయి..."అల్పో అల్పో మేఘ్ తేకే హల్కా బ్రిస్తీ హోయ్, ఛోట్టో ఛోట్టో గోల్పో థేకే భలోబాసా సృష్టి హోయ్" (చెదురుమదురు మేఘాలు తేలికపాటి వర్షాలను కురిపిస్తాయి, (అయితే) మనం వినే చిన్న కథల నుంచి ప్రేమ వికసిస్తుంది)" అని చేతితో రాసిన కవిత.


"భలోబాషి టోకే చాయ్ సారాఖోన్, అచిస్ తుయ్ మోనేర్ సాథే ..."(అన్ని వేళలా ప్రేమతో నువ్వు నాకు కావాలి, అన్ని వేళలా నువ్వు నా మనసులో ఉన్నావు...)


ఈ పేజీలను భద్రపరిచిన రెస్క్యూ ఆపరేషన్ టీం 


ఈ కవితల పేజీలను భద్రపరిచినట్లు రెస్క్యూ ఆపరేషన్ లో భాగమైన బృందం, స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఈ కవిత రాసింది ఎవరు, ఆ రచయితకు సంబంధించిన సమాచారం ఇంత వరకు తెలియలేదు. 


జూన్ 2న జరిగిన ఈ ప్రమాదంలో 275 మంది మరణించగా, 1000 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులు బాలాసోర్ నుంచి కటక్, భువనేశ్వర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.