గత జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన అత్యంత విషాదకర ఘటనకు కారణాలను కేంద్రం తొలిసారి వెల్లడించింది.  సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ప్రమాదం జరిగిందని వివరిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక వివరాలను విడుదల చేసింది. రాజ్యసభలో ఎంపీ డాక్టర్ జాన్ బ్రిట్టాస్ ప్రమాదం గురించి అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇస్తూ నివేదిక వివరాలు వెల్లడించింది. స్టేషన్‌ వద్ద సిగ్నలింగ్ సర్క్యూట్, ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బారియర్ లోపాలను నివేదికలో పొందుపరిచారు. "గతంలో నార్త్ సిగ్నల్ గూమ్టీ స్టేషన్ వద్ద సిగ్నలింగ్-సర్క్యూట్-మార్పులో లోపాలు తలెత్తాయి. లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్. 94 వద్ద ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బారియర్‌ మార్పులు, సిగ్నలింగ్ పనులు చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందని నివేదికలో కేంద్రం పేర్కొంది.


సాంకేతికతలో లోపాల కారణంగా రాంగ్ లైన్‌‌లో గ్రీన్ సిగ్నల్ పడిందని, ఫలితంగా ఆగి ఉన్న గూడ్స్ రైలు, మరో రైలు ఢీకొట్టిందని వెల్లడించింది. ఈ ప్రమాదం రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.  ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలభై ఒక్క మంది ప్రయాణికులను ఇంకా గుర్తించలేదని ప్రభుత్వం వెల్లడించింది. MP జాన్ బ్రిట్టాస్ రైలు ప్రమాదాల మీద ప్రశ్నించినా గత మూడు సంవత్సరాలలో ఇలాంటి సిగ్నల్ వైఫల్యాలపై ప్రభుత్వం వివరాలను అందించలేదు. కేవలం వైఫల్యాలు ఉన్నాయని మాత్రమే చెబుతోంది. కానీ ఏదీ బాలాసోర్‌లో జరిగినంత తీవ్రమైన సంఘటనకు దారితీయలేదు.


జులై ప్రారంభంలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) ప్రమాదానికి సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులు అరుణ్ కుమార్ మహంత, మహమ్మద్ అమీర్ ఖాన్, పప్పు కుమార్‌లను అరెస్టు చేసింది. హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, కుట్ర పూరిత హత్యా నేర అభియోగాలు వారిపై మోపారు. జూలై 15న రిమాండ్ కాలం ముగిసిన తర్వాత నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తదుపరి కేసు విచారణ జూలై 27కి వాయిదా వేశారు.


సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్‌పూర్ డివిజన్‌లోని బ్యాంక్‌రనాయబాజ్ స్టేషన్‌లో మే 16, 2022న వైరింగ్, కేబుల్ లోపం కారణంగా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది. సరైన చర్యలు తీసుకోవడం ద్వారా బాలాసోర్ లాంటి విషాదాన్ని నివారించవచ్చని CRS నివేదిక పేర్కొంది.


CRS నివేదికపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. రైల్వే భద్రత, ప్రయాణికుల సంరక్షణకు సంబంధించిన ప్రాథమిక అంశాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా రాజీపడిందని విమర్శించింది. ఈ మానవ తప్పిదం రాజకీయ నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషాద సంఘటన తరువాత, సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ అర్చన జోషిని ఆమె పదవి నుంచి తొలగించారు. ఆమె స్థానంలో అనిల్ కుమార్ మిశ్రాను నియమించారు.


బాలాసోర్‌‌లో సిగ్నలింగ్ లోపంలో కోల్‌కతా-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 293 మంది మరణించగా, సుమారు 1,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒడిశా ప్రమాదం ఒకటి.