Longest Serving CM: రాజకీయాల్లో సుదీర్ఘకాలం పదవిలో కొనసాగడం చాలా కష్టం. అందుకే పాలిటిక్స్ లో ఏదీ శాశ్వతం కాదు అని అంటుంటారు. అలాగే ఒక్కసారి పదవి వస్తే కొన్ని రోజుల పాటు కొనసాగడమే అతికష్టంగా ఉంటుంది. ఒకటీ రెండుసార్లు వరుసగా పదవి సాధించడం ఎంతో కష్టంగా ఉన్న రోజులు ఇవి. కానీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒకటీ రెండుసార్లు కాదు ఏకంగా వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి సీఎం పదవి చేపట్టారు. తాజాగా ఆయన ఓ రికార్డును కూడా బద్దలు కొట్టారు. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రెండో వ్యక్తిగా రికార్డు నెలకొలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగిన జ్యోతిబసు రికార్డును తాజాగా నవీన్ పట్నాయక్ అధిరోహించి..  రెండో స్థానంలో నిలిచారు. శనివారంతో నవీన్ పట్నాయక్ సీఎం హోదాలో 23 ఏళ్ల 138 రోజులు పూర్తి చేసుకున్నారు. కాగా, దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన నేతగా సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఉన్నారు. ఆయన 24 ఏళ్లకు పైగా సీఎం హోదాలో పని చేశారు. 


పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కమ్యూనిస్టు పార్టీ నేత జ్యోతి బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5వ తేదీ వరకు 23 ఏళ్ల 137 రోజులు సీఎంగా కొనసాగారు. ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ 2000 మార్చి 5వ తేదీ నుంచి 5 సార్లు సీఎం బాధ్యతలు చేపట్టి శనివారం నాటికి 23 సంవత్సరాలు 138 రోజులు పూర్తి చేసుకున్నారు. పవన్ కుమార్ చామ్లింగ్, జ్యోతి బసు తర్వాత వరుసగా ఐదు సార్లు సీఎంగా పని చేసిన నేతగానూ నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో నిలిచారు. వచ్చే ఏడాది 2024 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజూ జనతాదల్ - బీజేపీ మళ్లీ విజయం సాధిస్తే.. వరుసగా 6 సార్లు సీఎంగా పని చేసిన వ్యక్తిగా నవీన్ పట్నాయక్ రికార్డు బద్దలు కొడతారు. దాంతో పాటు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా కూడా పవన్ కుమార్ చామ్లింగ్ ను దాటి మొదటి స్థానంలో నిలుస్తారు. నవీన్ పట్నాయక్ 1997లో రాజకీయాల్లోకి వచ్చారు. 2000 లో సీఎం అయ్యారు. 2000, 2004, 2009, 2014, 2019 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చారు. 


నవీన్ పట్నాయక్ ఒడిశా ప్రజల మద్దతును పొందడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. ఐదుసార్లు ఆయన తన ప్రజల నుంచి విశేష మద్దతును నిలుపుకున్నారు. బెస్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆర్థిక, విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. అదే విధంగా పారిశ్రామికీకరణలో ఒడిశాలో కొత్త అధ్యాయం ప్రారంభించారు. విదేశీ పెట్టుబడుల్లో దేశంలోని ఒడిశా రెండో స్థానంలో నిలిపారు. అయితే నవీన్ పట్నాయక్ 23 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నప్పటికీ.. ఒడిశా ఇంకా పేద రాష్ట్రంగానే ఉందనే విమర్శలు ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి వస్తుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన ఒడిశాను అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదని ప్రతిపక్షలు విమర్శిస్తుంటాయి.