Posters Against Modi: 


ఢిల్లీ వ్యాప్తంగా వేలాది పోస్టర్లు..


ఢిల్లీలో ప్రధాని మోదీ పోస్టర్లు రాజకీయాల్ని వేడెక్కించాయి. మోదీ ఓ డిక్టేటర్‌ అంటూ వేలాది పోస్టర్లు అంటించారు. వీటిని చూసి బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 100 కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అయిన నలుగురిలో ఇద్దరికి ప్రింటింగ్‌ ప్రెస్‌లు ఉన్నాయి. "మోదీ హఠావో, దేశ్ బచావో" అని వెలిసిన పోస్టర్లను తొలగించారు పోలీసులు. ఇప్పటికే 2 వేల పోస్టర్లను తీసేశారు. పబ్లిక్ ప్రాపర్టీలపై ఇలాంటి పోస్టర్లు అంటించడం నేరం. పైగా వీటిని ప్రింట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ పేరు కూడా లేదు. చట్టరీత్యా ఇది నేరం అని పోలీసులు తేల్చి చెప్పారు. అంతే కాదు. ఈ పోస్టర్లన్నీ ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని ఓ వ్యాన్‌లో భారీ మొత్తంలో ఈ పోస్టర్లు ఉన్నట్టు తెలిపారు. డ్రైవర్‌ను ప్రశ్నించగా ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్తున్నానంటూ సమాధానమిచ్చాడు. అంతకు ముందే కొన్ని పోస్టర్లు డెలివరీ చేసినట్టు చెప్పాడు. ఆప్‌ ఈ వివాదంపై స్పందించింది. ఈ పోస్టర్లలో అంత అభ్యంతరకరమైన విషయం ఏముందని ప్రశ్నించింది. FIRలు నమోదు చేయడంపైనా అసహనం వ్యక్తం చేసింది. ఇది మోదీ నియంతృత్వానికి పరాకాష్ఠ అంటూ మండి పడింది. అరెస్ట్‌ అయిన నిందితులను విచారించగా...మోదీ హఠావో, దేశ్ బచావో పోస్టర్లను 50 వేల వరకూ ప్రింట్ చేయాలని ఆర్డర్ వచ్చినట్టు చెప్పారు. ప్రింటింగ్ ప్రెస్ పేరు పెట్టకపోవడం వల్లే అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. లిక్కర్ స్కామ్‌ బయటకు వచ్చినప్పటి నుంచి ఆప్, బీజేపీ మధ్య యుద్ధం మొదలైంది. కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆప్ ఆరోపిస్తోంది. అటు బీజేపీ ఆప్ ఓ అవినీతి పార్టీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.