Allu arjun Brand Value: దేశంలో ఎక్కువ బ్రాండ్‌ వాల్యూ ఉన్న టాప్‌-25 సెలెబ్రిటీల లిస్ట్‌లో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తొలిసారి అడుగు పెట్టారు. అంతేకాదు, చాలా మంది దక్షిణాది నటులు, స్పోర్ట్స్ ఛాంపియన్‌ల బ్రాండ్‌ వాల్యూ పెరిగింది, ఉత్తరాది నటులతో ఉన్న అంతరం తగ్గింది.


2022 సంవత్సరానికి ‘సెలబ్రిటీ బ్రాండ్‌ వాల్యుయేషన్‌ స్టడీ’ నివేదికను గ్లోబల్ రిస్క్ & ఫైనాన్షియల్ అడ్వైజరీ సొల్యూషన్స్ కంపెనీ క్రోల్‌ (Kroll) విడుదల చేసింది.


బాలీవుడ్‌ యాక్టర్‌ రణవీర్‌ సింగ్, $181.7 మిలియన్లతో, 2022లో భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీ. ఐదేళ్ల పాటు అగ్రస్థానంలో ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీని రెండో స్థానానికి నెట్టి, రణవీర్‌ సింగ్ ఫస్ట్‌ ప్లేస్‌లో కూర్చున్నాడు.


176.9 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. క్రికెట్ జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టిన తర్వాత కోహ్లీ బ్రాండ్ విలువ వరుసగా రెండు సంవత్సరాలు క్షీణించింది. అతని బ్రాండ్ విలువ 2020లో $237 మిలియన్లకు పైగా ఉంది. 2021లో బాగా తగ్గి $185.7 మిలియన్లకు చేరుకుంది. 2022లో ఇంకా తగ్గింది.


2022లో, బ్రాండ్ విలువ పరంగా దేశంలోని టాప్‌-5లో నిలిచిన ప్రముఖులు:


రణవీర్ సింగ్ ( రూ.1500 కోట్లు లేదా $181.7 మిలియన్)
విరాట్ కోహ్లీ (రూ. 1450 కోట్లు లేదా $176.9 మిలియన్) 
అక్షయ్ కుమార్ (రూ. 1260 కోట్లు లేదా $153.6 మిలియన్) 
అలియా భట్ (రూ. 850 కోట్లు లేదా $102.9 మిలియన్) 
దీపికా పదుకోన్‌ (రూ. 680 కోట్లు లేదా $82.9 మిలియన్) 


అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్‌ టాప్ 10 జాబితాలో ఉన్నారు. 


2022లో టాప్ 25 మంది ప్రముఖుల మొత్తం బ్రాండ్ విలువ $1.6 బిలియన్లుగా క్రోల్‌ అంచనా వేసింది. 2021 కంటే ఇది 29.1 శాతం పెరిగింది. 


వాల్యూ పెంచుకున్న దక్షిణాది నటులు


2016లో, భారతదేశంలోని టాప్ 20 సెలబ్రిటీల బ్రాండ్ విలువలో బాలీవుడ్ తారల వాటా 81.7 శాతంగా ఉంది, మిగిలిన 18.3 శాతం మంది క్రీడాకారులు. 2022లో బాలీవుడ్ స్టార్ల వాటా 67.6 శాతానికి పడిపోయింది, స్పోర్ట్స్ స్టార్స్ 28.9 శాతానికి చేరారు. మిగిలిన 3.5 శాతాన్ని తెలుగు సినీ నటులు దక్కించుకున్నారు.


2022లో, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన మొదటి పది భారతీయ సినిమాలలో ఆరు దక్షిణ భారత పరిశ్రమ నుంచి వచ్చాయి. దీంతో దక్షిణాది ప్రముఖుల బ్రాండ్‌ విలువ పెరిగింది. టాప్‌-10 సినిమాల్లో మొదటి నాలుగు తమిళం, తెలుగు ఇండస్ట్రీల నుంచే వచ్చాయి. అవి...  KGF-చాప్టర్ 2 (ప్రపంచవ్యాప్తంగా $153.5 మిలియన్లు), RRR ($147.4 మిలియన్లు), పొన్నియిన్ సెల్వన్: పార్ట్ I ($58.9 మిలియన్లు), విక్రమ్ ($51.6 మిలియన్లు).


"ఈ కలెక్షన్లు దక్షిణాది సినీ ప్రముఖులకు అనుకూల వాతావరాణాన్ని సృష్టించింది. భారతదేశంలోని కొన్ని ప్రముఖ బ్రాండ్‌లకు నేషనల్‌ ఫేస్‌గా (బ్రాండ్‌ అంబాసిడర్‌) దక్షిణ భారత సెలబ్రిటీలను నిలబెట్టింది. కంటెంట్ & స్టోరీలు బాక్సాఫీస్‌ను నడిపించినట్లు కనిపిస్తోంది” - అవిరల్ జైన్, క్రోల్‌లో వాల్యుయేషన్ అడ్వైజరీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ 


దక్షిణాది స్టార్ల బ్రాండ్‌ వాల్యూ
దక్షిణ భారత స్టార్లలో... అల్లు అర్జున్ (KFC, రెడ్‌బస్, కోకా కోలా, జొమాటో) రూ.260 కోట్ల బ్రాండు విలువతో 20వ స్థానంలో నిలిచాడు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు రూ. 219 కోట్లతో 23వ స్థానంలో, రష్మిక మందన్న (వేక్‌ఫిట్, బోఅట్, సిటీ బ్యాంక్, మెక్‌డొనాల్డ్స్) రూ. 209 కోట్లు బ్రాండ్‌ వాల్యూతో 25వ స్థానంలో నిలిచారు. రామ్ చరణ్ (హీరో మోటోకార్ప్, పార్లే ఆగ్రో), సమంత రూత్ ప్రభు (MIVI, డ్రీమ్11, మామఎర్త్, మింత్ర, ఫోన్‌పే), తమన్నా భాటియా (హింద్‌వేర్, సుగార్ కాస్మెటిక్స్, రీబాక్, వోక్స్‌వ్యాగన్) కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. హార్ధిక్‌ పాండ్యా, ఒలింపిక్స్‌ బంగారు పతక విజేత నీరజ్‌ చోప్రా తొలిసారి ఈ జాబితాలో చోటు సాధించారు.


2022లో స్పోర్ట్స్ సెలబ్రిటీల ఎండార్స్‌మెంట్స్‌పై ఖర్చు పెరిగింది. క్రోల్ నివేదిక ప్రకారం, మొత్తం 444 డీల్స్‌లో 126 ఎండార్స్‌మెంట్ డీల్స్‌లో క్రికెట్‌యేతర క్రీడాకారులవి. 2021 ఒలింపిక్స్ సమయంలో వర్ధమాన క్రీడాకారులకు స్పాన్సర్‌షిప్‌లు 79 శాతం పెరిగాయి, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల మొత్తం విలువలో 13 శాతం వాటాతో నిలిచాయి.